దాడి కేసులో 14 రోజుల రిమాండ్

వరంగల్ అర్బన్ జిల్లా : అయోధ్య రామమందిర నిర్మాణం కోసం బీజేపీ నేతలు చందాలు వసూలు చేస్తున్నారని, వాటి లెక్కలు చూపాలని వరంగల్ రూరల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు వరంగల్ లో రాజకీయ వేడిని రగిలించాయి. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నక్కలగుట్టలోని ఆయన నివాసంపై బీజేపీ శ్రేణులు రాళ్లతో, కర్రలతో దాడులకు దిగాయి. ప్రతిగా తమ పార్టీ ఎమ్మెల్యే ఇంటిపై బీజేపీ శ్రేణుల దాడిని ఖండిస్తూ భగ్గుమన్న గులాబీ శ్రేణులు హంటర్ రోడ్డులోని బీజేపీ జిల్లా కార్యాలయంపై రాళ్లతో, కర్రలతో దాడి చేసి, పలు వాహనాలను ధ్వంసం చేశారు, పరకాలలో బీజేపీ కార్యాలయానికి నిప్పంటించారు. దీంతో ఆదివారం అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ కార్యకర్తల దాడులు, ప్రతిదాడులతో వరంగల్ నగరం ఉద్రిక్తంగా మారింది.

 

ఆదివారం రాత్రి బీజేపీ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆధ్వర్యంలో పలువురు బీజేపీ నేతలు టీఆర్ఎస్ ప్రతిదాడిని నిరసిస్తూ సుబేదారి పీఎస్ లో నిరసన దీక్షకు దిగారు. దీన్ని పోలీసులు అడ్డుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణుల దాడిని నిరసిస్తూ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ , కొప్పుల ఈశ్వర్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డిని పరామర్శించారు. దాడి జరిగిన తీరును పరిశీలించారు. బీజేపీ చిల్లర రాజకీయాలు మానాలని హెచ్చరించారు. వరంగల్ జిల్లాలో బీజేపీ దాడులను ఖండిస్తూ రాష్ట్ర, కేంద్రస్థాయి బీజేపీ నేతలు స్పందించాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ప్రతిదాడులు తప్పవని వారు బీజేపీ అధిష్టానాన్ని హెచ్చరించారు.

దీంతో మండిపడిన బీజేపీ నేతలు సోమవారం రోజు చలో వరంగల్ కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే బీజేపీ కార్యాలయాలపై టీఆర్ఎస్ శ్రేణుల దాడులు, బీజేపీ నాయకుల అరెస్ట్ లను ఖండించారు. దాడికి పాల్పడిని బీజేపీ శ్రేణులను పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి వరంగల్ అర్బన్ జిల్లాకు బయల్దేరిన  మాజీ మంత్రి డికె అరుణ, తెలంగాణ శాసనసభ పక్ష నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, మాజీ ఎంపి ఏపీ జితేందర్ రెడ్డి మరియు వారి బృందాన్ని పోలీసులు మార్గం మధ్యలోనే ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ ను ఘట్ కేసర్ వద్ద పోలసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఇక బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని ఆలేరు వద్ద అరెస్ట్ చేసి, భువనగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.అయితే వరంగల్ కు వస్తున్న పలువురు బీజేపీ సీనియర్ నేతలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య రాజకీయ వేడి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలాగా ఉంది. ఇప్పటికే వరంగల్ అర్బన్ జిల్లాలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడికి దిగిన బీజేపీ శ్రేణులను సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకుని, అందులో పలువురు నిరసన కారులను ఆదివారం రాత్రి కేయూ పోలీసుస్టేషన్ కు తరలించారు. సోమవారం బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తో పాటు, పలువురు మహిళా నాయకులను సుబేదారి పోలీసు స్టేషన్ నుంచి పోలీసులు జిల్లా కోర్టుకు తరలించారు.టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన 53 మందిపై సుబేదారి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వీరిలో 14 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఇక 39 మంది బీజేపీ నిరసనకారులకి 14 రోజుల రిమాండ్ కల్పించింది.అయితే ఎమ్మెల్యే వ్యాఖ్యలు అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ మధ్య రాజకీయ వేడిని రాజేసాయి. దాడులు, ప్రతిదాడులు, అరెస్టులు, రిమాండ్ పర్వం కొనసాగుతున్నా మరో ప్రక్క వరంగల్ జిల్లాలో ఈ ఉద్రిక్త పరిస్థితులకు మాత్రం తెరదింపడం లేదు. పైగా రాష్ట్రవ్యాప్తంగా రగులుకున్న వరంగల్ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ రాజకీయ వేడి అటు రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటనపై కూడా పడింది. సిరిసిల్లలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ పర్యటనను బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు.

 

గ్రేటర్ వరంగల్ లో రానున్న రోజుల్లో జరుగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తుందని, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులకు దిగుతుందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ప్రతిగా టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు దిగుతూ ఒకరికొకరు నువ్వా నేనా అన్నట్లు బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ లో లొల్లికి ఆజ్యం పోసుకుంటున్నారు.