కొత్త రకం కరోనా కేసులు 150

న్యూఢిల్లీ : దేశంలో కొత్త రకం కరోనా కేసుల సంఖ్య 150కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం తెలిపింది. బ్రిటన్ వేరియంట్ కరోనా వైరస్ సోకిన వారిని ప్రత్యేక ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందచేస్తున్నట్లు తెలిపింది. వారి ప్రైమరీకాంటాక్డులను గుర్తించి క్వారంటైన్‎లో ఉంచినట్లు వెల్లడించింది. బ్రిటన్ వేరియంట్ కరోనా వ్యాప్తిని నిశితంగా గమనిస్తున్నామని చెప్పింది. నిఘాతోపాటు సేకరించిన నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

గత యేడాది నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్య సుమారు 33వేల మంది ప్రయాణికులు బ్రిటన్ నుంచి విమానాల్లో భారత్ చేరుకున్నారు. వీరికి ఎయిర్ పోర్టుల వద్ద కరోనా పరీక్షలు నిర్వహించగా కొందరికి బ్రిటన్ వేరియంట్ కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కొత్త రకం కరోనా కేసులు మొదట పదుల సంఖ్యలో ఉండగా శనివారం నాటికి 150కి పెరిగింది. అయితే బ్రిటన్ వేరియంట్ కరోనా వ్యాప్తి అదుపులోనే ఉన్నదని, కొత్త కేసుల నమోదు తగ్గిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.