ఎన్‎కౌంటర్‎లో 3గురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‎లో జరిగిన ఎన్‎కౌంటర్‎లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. అవంతిపోరలోని మందూరా ట్రాల్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. మందూరా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లు గురువారం తమకు సమాచారం అందిందని కశ్మీర్ ఐజీ తెలిపారు. దీంతో పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ కలిసి ఆ ప్రాంతాన్ని శుక్రవారం చుట్టుముట్టినట్లు చెప్పారు. లొంగిపోవాలని ఉగ్రవాదులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని, భద్రతా సిబ్బందిపైకి వారు గ్రెనైడ్లు విసరడంతో ఇరువైపులా ఎదురుకాల్పులు జరిగాయని వివరించారు. హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ఈ ఎన్ కౌంటర్ లో మరణించినట్లు వెల్లడించారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని కశ్మీర్ ఐజీ పేర్కొన్నారు.