ప్రదీప్ కి గుడ్ బిగినింగ్ కావాలి

‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రం పెద్ద హిట్ అయి హీరోగా ప్రదీప్ కి గుడ్ బిగినింగ్ అవ్వాలి.. ప్రీ రిలీజ్ వేడుకలో అతిథుల ఆకాంక్షహైదరాబాద్​ : యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ గా యస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఫణి ప్రదీప్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ అభిరుచిగల నిర్మాత యస్వీ బాబు నిర్మించిన చిత్రం “30 రోజుల్లో ప్రేమించడం ఎలా”. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో రూపొందిన ఆడియో మ్యూజికల్ హిట్ గా నిలిచి 300 మిలియన్స్ వ్యూస్ సాధించింది. జనవరి 29న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లలో యూవీ, జీఏ 2 సంస్థల ద్వారా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 26న హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో పండగ వాతావరణాన్ని తలపించేలా వైభవంగా జరిగింది.. ఈ కార్యక్రమానికి సుమ తనదైన శైలిలో వ్యాఖ్యాతగా వ్యవహరించి అందర్నీ అలరించారు. ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి, మారుతీ, హీరోలు కార్తికేయ, అడవి శేష్, ప్రముఖ నిర్మాత సీ కళ్యాణ్, ప్రదీప్ మాచిరాజు, హీరోయిన్ అమృత అయ్యర్, ఫణి ప్రదీప్, అనూప్ రూబెన్స్, కెమెరామెన్ శివేంద్ర, సింగర్స్ సిద్ శ్రీరామ్, కమెడియెన్స్ సుధీర్, గెటప్ శ్రీను, రాంప్రసాద్, మహేష్, భద్రం, ఆది, నటుడు సమీర్, నటి హేమ, నిర్మాత యస్వీ బాబు, పాటల రచయిత అనంత్ శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం అనిల్ రావిపూడి, మారుతి, కార్తికేయ, అడవి శేష్ సంయుక్తంగా ప్లాటినం డిస్క్ లను ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్ కి అందించారు.

‘యస్వీ బాబు నాకు బాగా ఇష్టమైన వ్యక్తి . ఎన్ని వ్యాపారాలు చేసినా ఆయన నాలాగే మంచి సినిమాలు చేయాలనుకొనే సినిమా లవర్. ప్రదీప్ తో తీసిన ఈ సినిమా బాగా ఆడి రాబోయే ముఫ్పై రోజుల్లో బాబు మరిన్ని డబ్బులు రావాలి’ అన్నారు ప్రముఖ నిర్మాత సీ కళ్యాణ్​.

‘నీలి నీలి పాట ఒక సంవత్సరం అంతా వినేలా చేసింది. అంటే మాములు విషయం కాదు. అంతటి గొప్ప పాటని కంపోజ్ చేసిన అనూప్ టీమ్ కి ఆల్ ది బెస్ట్. పాట ఎంత పెద్ద హిట్ అయిందో సినిమా కూడా అంతే హిట్ కావాలి. ప్రదీప్ బుల్లి తెరపై అందర్నీ ఎంటర్​టైన్​ చేశాడు. ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై కూడా ఎంటర్​టైన్​ చేయడానికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మున్నా చాలా రోజులుగా తెలుసు. ఎప్పుడు కలిసిన డిఫరెంట్ కథలు చెపుతుంటాడు. అతని మాటలు, మెసేజ్ లు చాలా ఇన్​స్పైరింగ్ గా ఉంటాయి. మున్నాకి ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి’ అన్నారు దర్శకుడు మారుతి.

‘ప్రదీప్ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా మంచి హిట్ అయి అతనికి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి. నా పటాస్ సినిమాను యస్వీ బాబు కన్నడలో రిలీజ్ చేశారు. అక్కడ కూడా బాగా ఆడింది. ఈ సినిమాలోని నీలి నీలి పాట వన్ ఇయర్ నుంచి స్టిల్ రన్నింగ్ అవుతూ.. శ్రోతలను అలరిస్తుంది. పాడుకోవడానికి చాలా ఈజీగా ఉన్నాయి లిరిక్స్. అనూప్ టీమ్ కి కంగ్రాట్స్. ఈ సినిమా సూపర్ హిట్ అయి నిర్మాత బాబుకు మరిన్ని డబ్బులు రావాలి’ అన్నారు యువ దర్శకుడు అనిల్​ రావిపూడి.

‘ప్రదీప్ చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉన్న వాళ్లు పెద్ద పొజిషన్స్ కి వెళతారు అని నేను గట్టిగా నమ్ముతాను. అది ప్రదీప్ అన్నలో బాగా ఉంది. నైన్టీ ఎంఎల్​ మూవీలో ‘సింగిల్ సింగిల్’ పాట బిగ్ హిట్ అయింది. దానికి పదింతలు నీలి నీలి సాంగ్ హిట్ అయింది. అనూప్ వండర్​పుల్​ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలి ప్రదీప్ మంచి హీరోగా స్థిరపడాలని కోరుకుంటున్నాను’ అన్నారు హీరో కార్తికేయ.

‘ప్రతి ఒక్కరూ వారి కుటుంబంలో ఒక సభ్యుడిగా భావించి.. ఆదరించి అభిమానించారు. వారందరి సపోర్టుతోనే ఇక్కడిదాకా రాగలిగాను. నేను ఈ స్థాయికి రావడానికి పదేళ్లు పట్టింది. ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. మున్నా కథ చెప్పినప్పుడు నేను చేయగలనా అనే భయం వేసింది. ప్రతిక్షణం మున్నా నా వెంట ఉండి.. నువ్ చేయగలవ్ అని.. ఎంకరేజ్ చేస్తూ నా మీద నమ్మకంతో ఈ సినిమాలో చేసే అవకాశం ఇచ్చాడు’ అన్నారు చిత్ర హీరో ప్రదీప్​ మాచిరాజు.

‘ నీలి నీలి పాట 300 మిలియన్స్ దాటి ఇంకా ట్రెండింగ్ లో ఉంది. అంతలా హిట్ అయింది. చాలా రోజుల తర్వాత ఆడియో ప్లాటినం డిస్క్ అందుకోవడం చూస్తుంటే బుజ్ బమ్స్ వస్తున్నాయి. ఈ క్రెడిట్ అంతా అనూప్ దే. ఎక్స్ లెంట్ మ్యూజిక్ ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ మార్చ్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా పాండమిక్ వల్ల డిలే అయిందని బాధపడుతున్న టైంలో మా నీలి నీలి పాట ఒక ఎనర్జీని ఇచింది. మా బాధంతా పోయేలా చేసింది. అందరం కష్టపడి ఒక మంచి సినిమా చేశాం’ అన్నారు చిత్ర దర్శకుడు ఫణి.

‘ నీలి నీలి పాట ఎంతలా హిట్ అయిందో అంతకంటే గొప్పగా సినిమా ఉంటుంది. నాకు సపోర్ట్ చేసిన మా టీమ్ అందరికీ థ్యాంక్స్​. అలాగే నీలి నీలి సాంగ్ పాడిన సిద్ శ్రీరామ్, సునీతకు స్పెషల్ థ్యాంక్స్​ . ఈ చిత్రంలో నాకు బాగా ఇష్టమైనది అమ్మ పాట. దీనిని అమ్మలకు డెడికేట్ చేస్తున్నాం’ అన్నారు మ్యూజిక్​ డైరెక్టర్​ అనూప్​ రూబెన్స్​.