బస్సు ప్రమాదంలో 39 మంది మృతి

భోపాల్: మధ‌్యప్రదేశ్ లోని సిధి జిల్లాలో మంగళవారం ఉదయం 8.30 గంటలకు ‎‎ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వేగంగా వెళ‌్తున్న బస్సు అదుతప్పి పాట్నా గ్రామం వద్ద రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి ఏడుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఇప్పటి వరకు 39 మంది మృత దేహాలను బయటకు వెలికితీశారు. బస్సు నీటిలో పూర్తిగా మునిగిపోవడంతో మిగితా వారందరూ గల్లంతు అయ్యారు. క్రేన్ సహాయంతో కాలువలో పడిన బస్సును బయటకు తీశారు. గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు చేపట్టిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బన్ సాగర్ డ్యాం నుంచి కాలువకు నీటి విడుదలను ఆపేశారు. ప్రమాదానికి గురైన బస్సు సిధి నుంచి సాత్నా వైపు వె‌ళ‌్తుండగా డ్రైవర్ అదుపు తప్పడం వల్లే ‎ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

ఈ ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ ‎ఘటనపై పూర్తి స్థాయిలో దర్యప్తు జరపాలని పోలీసులను ఆదేశించారు.