నేడు 4వ విడత పంచాయతీ పోలింగ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు ఎస్ ఈ సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. నేడు ఉదయం 6.30 ని.ల నుంచి మధ్యాహ్నం 3.30 ని.ల వరకు పోలింగ్ కొనసాగనుంది. 13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 161 మండలాల్లో ఎన్నికలు జరుగనుండగా 28, 995 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 6,047 సమస్యాత్మక, 4,967 అతి సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఆయాచోట్ల పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు 53,282 మంది సిబ్బందిని నియమించారు. ఎన్నికల్లో దాదాపు 67,75,226 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 ని.ల వరకే పోలింగ్ జరుగుతుంది. 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలు కానుంది.

నాలుగో విడత 161 మండలాల్లోని 2,743 సర్పంచ్ స్థానాలకు, 22,514 వార్డులకు ఎన్నికల నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ తెలిపారు. ఈ విడత మొత్తం 3,299 పంచాయతీలు, 33,435 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటికే 553 సర్పంచ్ స్థానాలు, 10,921 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పంచాయతీలు, వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ స్పష్టం చేశారు. సర్పంచ్ స్థానాలకు 7475 మంది, వార్డులకు 52,700 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు పేర్కొన్నారు. సర్పంచ్ స్థానాలకు రెండు చోట్ల, వార్డు స్థానాలకు 91 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదని ఎస్ఈసీ వెల్లడించారు.