ఇంద్రకీలాద్రిపై ఏసీబీ తనిఖీల్లో ట్విస్ట్

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఏసీబీ తనిఖీల్లో ట్విస్ట్ నెలకొంది. గత నాలుగేళ్ల క్రితం ఫైళ్లను ఏసీబీ అధికారులు తవ్వారు. గత పాలకమండలిలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ఫైళ్లను బయటకు లాగింది. ఇప్పటికే మూడ్రోజులుగా తనిఖీలు కొనసాగుతున్నాయి. కొండపై కీలక విభాగాల్లోని సమాచారాన్ని ఏసీబీ సేకరించినట్లు తెలుస్తోంది. నాలుగేళ్లలో ఇంద్రకీలాద్రిపై జరిగిన అభివృద్ధి పనులు, టెండర్ల ప్రక్రియ, ఇంజినీరింగ్ విభాగంలోని సమాచారం సేకరిస్తున్నట్లు సమాచారం.

దుర్గగుడి ఈవో ఎంవీ సురేశ్‌బాబును లక్ష్యంగా చేసుకునే ఏసీబీ దాడులు జరుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏడాదిన్నరగా ఇంద్రకీలాద్రిపై వెలుగుచూస్తున్న అవినీతి, అక్రమాలు, వివాదాలన్నింటికీ ఈవో సురేశ్‌బాబే కేంద్ర బిందువు. దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అండతోనే ఇష్టారాజ్యంగా ఆయన చెలరేగిపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తులను పట్టించుకోకుండా వీవీఐపీలు, వీఐపీలు, అధికార పార్టీ నాయకుల సేవల్లోనే మునిగి తేలుతున్నారు. ముడుపుల సంస్కృతిని ప్రవేశపెట్టి తనకు కావాల్సిన వారికి, అస్మదీయులకు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి