చండీగఢ్ : బిడ్డను ఎత్తుకుని ఒక మహిళా కానిస్టేబుల్ ట్రాఫిక్ విధులు నిర్వహించారు. ఒక వ్యక్తి దీనిని వీడియో తీసి ట్విట్టర్లో పోస్ట్ పెట్టడంతో అది ఇప్పుడు వైరల్‌గా మారింది. చండీగఢ్‌కు చెందిన ప్రియాంక ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల సెక్టార్ 29 వద్ద ఉదయం 8 గంటలకు ఆమె రిపోర్ట్ చేయాల్సి ఉంది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఆమె రాలేకపోయింది. విధులకు హాజరుకావాలని అధికారి చెప్పడంతో తన బిడ్డతో కలిసి అక్కడికి వచ్చి ట్రాఫిక్ విధులు నిర్వహించినట్లు తెలుస్తోంది.

చేతిలో బిడ్డతో ప్రియాంక ట్రాఫిక్ విధులు నిర్వహించడాన్నిగుర్తించిన ఒక వ్యక్తి సెల్ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. కొందరు నెటిజన్లు ఆ మహిళా ట్రాఫిక్ పోలీస్ విధి నిర్వహణను ప్రశంసించారు. బిడ్డ పట్ల తల్లి ప్రేమను మెచ్చుకున్నారు. మరి కొందరు మాత్రం ఆమె చర్యను తప్పు బట్టారు. ఒక వైపు కరోనా, మరోవైపు కాలుష్యం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎండలో రోడ్డుపై విధులు నిర్వహించడాన్ని మంచిది కాదన్నారు. పసి బిడ్డలున్న మహిళా ఎంప్లాయిస్‌కు తగిన సౌకర్యాలు కల్పించని ప్రభుత్వం , అధికారులపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.