ఏసీబీకి చిక్కిన సైట్ ఇంజినీర్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా : జిల్లాలోని టేకుమట్ల మండల కేంద్రంలో ఏతెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్‎ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ) కి చెందిన సైట్ ఇంజనీర్ రూ.5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం టేకుమట్ల మండలంలోని కుందనపల్లి ప్రభుత్వ పాఠశాలలో వాటర్ సరఫరాకు సంబంధించి పూర్తైన పనుల ఎంబీ రికార్డు కోసం స్కూల్ చైర్మన్ దేశెట్టి ఓదెలును సైట్ ఇంజినీర్ డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో ఓదేలు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

ఇందులో భాగంగానే శుక్రవారం మండల కేంద్రంలో ఏసీబీ అధికారులు షాపుల వద్ద వేచి ఉన్నారు. ఈ క్రమంలో ఓ ఫర్టిలైజర్ షాప్ ముందు రోడ్డుపై కుమారస్వామి ఓదేలు నుంచి రూ.5వేలు తీసుకుంటుండగా పట్టకున్నారు. అతన్ని అధికారులు విచారించి, ఏసీబీ స్పెషల్ జడ్జి ఎదుట ప్రవేశపెట్టేందుకు హైదరాబాద్ కు తరలించారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని డీఎస్పీ సూచించారు. ఏసీబీ సీఐ వెంకట్ , సతీష్ , క్రాంతికుమార్, తదితరులు పాల్గొన్నారు.