నగర సుందరీకరణ పనుల్లో వేగం పెంచండి : మేయర్

వరంగల్ అర్బన్ జిల్లా : నగర సుందరీకరణ పనులు వేగవంతంగా చేపట్టి శనివారం కల్లా పూర్తి చేయాలని గ్రేటర్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో నగరంలో కొనసాగుతున్న సుందరికరణ, నాలల పూడికతీత, మంచినీటి పైపులైన్ ల లీకేజీ మరమ్మత్తు మొదలగు అభివృద్ధి పనుల పురోగతిని ఇంజనీరింగ్ అధికారులతో మేయర్ గుండు సుధారాణి సమీక్షించారు.

ads

సీఎం కేసీఆర్ ఈ నెల 21 న వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా నగరంలోని పలు డివిజన్లలో శానిటేషన్, నర్సరీలు పరిశీలించే అవకాశం ఉన్నదని అన్నారు. అర్బన్ జిల్లా కలెక్టర్ , ఇంచార్జి జిడబ్ల్యూ ఎంసి కమిషనర్ రాజివ్ గాంధీ హన్మంతు జిల్లా, మునిసిపల్ అధికారులతో స్పెషల్ ఆఫీసర్లను ఏర్పాటు చేశారన్నారు. ఈ బృందం అధికారులు సమన్వయంతో నిత్యం పనులను పర్యవేక్షిస్తూ మహానగర వ్యాప్తంగా గుర్తించిన రహదారులు, జంక్షన్లు, డివైడర్ ల మరమ్మతులు, మెయిడెన్ లు, రహదారులకు ఇరువైపులా మొక్కలు, పచ్చదనం ఏర్పాటు, సుందరీకరణ, నాలాల పూడికతీత పనులు పూర్తి చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా నగరంలోని 26 నాలలతో పాటు అంతర్గత నాలల పూడికతీత ప్రగతి పై సమీక్షించి ఇప్పటివరకు 80 శాతం నాలల పూడిక తీత పూర్తయిందని మేయర్ తెలిపారు. మిగిలిన లక్ష్యాన్ని తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. తీసిన పూడికను ఎప్పటికపుడు డంప్ యార్డులకు తరలించాలని చెప్పారు. బల్దియా, పబ్లిక్ హెల్త్ అధికారులు సమన్వయం తో నగరంలో గుర్తించిన 1155 త్రాగునీటి పైపులైన్ లీకేజీలను యుద్ధప్రాతిపదికన అరికట్టాలని, అవసరమైతే మెన్ అండ్ మెటీరియల్ అధికంగా సమకూర్చుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో బల్దియా ఎస్ ఈ సత్యనారాయణ, ఈ ఈ లు శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.