ఆ బొమ్మపై పూనమ్ కౌర్ ఫిదా

వరంగల్ అర్బన్ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో దర్సీస్‎కి పెట్టింది పేరు వరంగల్ కొత్తవాడ . చేనేత వృత్తినే నమ్ముకున్న వరంగల్ కొత్తవాడలోని సుమారు 500 కుటుంబాలు ప్రభుత్వ సాయం అందక ఎంతో ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. అయినప్పటికీ తమ కళానైపుణ్యాన్ని ప్రపంచానికి మళ్లీ మళ్లీ తెలపాలన్న తపనతో వెలికితీస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే చేనేత కార్మికుడు బైరి నర్సయ్య దర్సీస్ పై ఫేమస్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ బొమ్మ నేసి వారేవ్వా అనిపించుకున్నాడు.

ads

అయితే సినీ నటి, మాజీ చేనేత అంబాజిడర్ పూనమ్ కౌర్ ఇటీవల వరంగల్ చేనేత కార్మికులను, వరంగల్ దర్రీస్ తయారీ పని విధానాన్ని తెలుసుకొనుటకు మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, చేనేత కార్మికుల సంఘం నాయకుడు చిప్ప వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కొత్తవాడలో పర్యటించింది. చేనేత కుటుంబాల పరిస్థితిని దగ్గరుండి చూసింది. వారి కళానైపుణ్యాన్ని పరిశీలించి ఆశ్చర్యపోయింది. వరంగల్ దర్సీస్ కు ఆదరణ పెరిగేలా, ప్రభుత్వం నుంచి సాయం అందేలా తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా పూనమ్ కౌర్ హామీ ఇచ్చింది. అనంతరం దర్రీస్ పై ప్రముఖుల చిత్రాలను నేసిన నేతన్నల కళానైపుణ్యానికి ఫిదా అయిన పూనమ్ దర్రీస్‎పై క్రికెటర్ సచిన్ టెండూల్కర్ బొమ్మ నెయ్యాలని చేనేత కార్మిక నాయకుడు చిప్ప వెంకటేశ్వర్లకు సూచించింది. ఈ విషయాన్ని చిప్ప వెంకటేశ్వర్లు చేనేత కళాకారుడు బైరి నర్సయ్యకు తెల్పడంతో వారం రోజుల్లో దర్రీపై సచిన్ బొమ్మను నేసి, వాట్సప్‎లో పూనమ్‎కి సెండ్ చేశారు. దర్రీపై సచిన్ బొమ్మను చూసిన పూనమ్ ఫిదా అయ్యిందని చేనేత కార్మిక నాయకుడు చిప్ప వెంకటేశ్వర్లు తెలిపారు. త్వరలోనే సచిన్ బొమ్మతో నేసిన దర్రీని కొనుగోలు చేయనున్నట్లు ఆమె తెలిపినట్లు చిప్ప వెంకటేశ్వర్లు తెలిపారు.

దర్రీపై సచిన్ బొమ్మ నేసిన చేనేత కళాకారుడు బైరి నర్సయ్య గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, గొల్ల భామ, కేసీఆర్, జవహర్ లాల్ నెహ్రు బొమ్మలు నేసి అందరిచే ఔరా అనిపించుకున్నాడు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ బొమ్మ నేసిన బైరి నర్సయ్య కళా నైపుణ్యాన్ని పూనమ్ కౌర్ మెచ్చుకుంది.