సారీ చెప్పిన యాంకర్ ప్రదీప్

హైదరాబాద్ :  ఏపీ రాజధాని విశాఖ అంటూ వ్యాఖ్యానించడం బుల్లితెర యాంకర్ ప్రదీప్ కు పెద్ద తలనొప్పినే తెచ్చిపెట్టింది. తాజాగా ఓ షోలో పాల్గొన్న యాంకర్ ప్రదీప్ ఏపీ రాజధాని విశాఖ అని వ్యాఖ్యానించడం పై అమరావతి పరిరక్షణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో ఉన్న అంశాలపై యాంకర్ ప్రదీప్ ఎలా మాట్లాడుతారని, తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ప్రదీప్ క్షమాపణ చెప్పకుంటే హైదరాబాద్ లోని ఆయన ఇంటిని ముట్టడిస్తామని అమరావతి పరిరక్షణ సమితి హెచ్చరికలు జారీ చేసింది.

ads

అయితే ఈ వివాదంపై యాంకర్ ప్రదీప్ స్పందించారు. ఓ వీడియో రిలీజ్ చేస్తూ తన సందేశాన్ని అందరికీ వినిపించారు. ‘ అందరికీ నమస్కారం..రీసెంట్ గా జరిగిన ఓ షోలో నేను రాష్ట్రం దాని రాజధాని ఏంటి లాంటి ప్రశ్నలు అడిగే పద్దతిలో, సిటీ పేరు చెప్పి ఈ సిటీ రాజధాని ఏంటి అని అడగడం జరిగింది. ఈ ప్రశ్న తప్పు అని చెప్పకుండా అవతలి వ్యక్తి వేరే ఆన్వర్ ఇవ్వడంతో ఈ పూర్తి సంభాషణ ఏదైతే ఉందో తప్పుదోవలో అర్థమైంది. వేరేవిధంగా బయటకు వెళ్లడంతో చాలా బాధగా అనిపించింది. దీని ద్వారా ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా, ఎవరినైనా ఇబ్బందిపెట్టినా .. అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. కించపరచాలని, ఎవరినో హేళన చేయాలని గానీ జరుగుతున్న పరిస్థితుల మీద ఇలా మాట్లాడాలని గానీ ఎప్పుడూ ఉద్దేశం ఉండదు. ..ఎప్పుడూ కూడా నేను అలాంటి పని చేయను. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్ చేయాలనేదే నా ముఖ్య ఉద్దేశ్యం. తప్పకుండా మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ మీ ప్రదీప్ ‘ అని వీడియోతో వివాదానికి చెక్ పెట్టేశారు.