ఆంధ్రుల కల సాకారం.. పోలవరం తొలి ఫలితం

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాసన పుత్రిక ‘పోలవరం’. ఆయన హయాంలో రూపుదాల్చుకున్న ఈ ప్రాజెక్టు సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో పరుగులు పెడుతోంది. ప్రాజెక్టు పనులు వేగవంతం జరుగుతుండగానే తొలి ఫలితం రాబోతుంది. గోదావరి డెల్టాకు పోలవరం మీదుగా నీటిని విడుదలకు శుక్రవారం అంకురార్ఫణ జరిగింది. దీనిలో భాగంగా ఈసీఆర్ఎఫ్ నిర్మాణం కోసం అప్పర్ కాఫర్ డ్యాం పూర్తి చేసి స్పిల్ వే మీదుగా నీటిని విడుదల చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ వద్ద గోదావరి నది సహజ ప్రవాహాన్ని అప్ప్రోచ్ ఛానల్ గుండా స్పిల్ వేకు మళ్లించిన సందర్భంగా శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాన్ని జలవనరుల శాఖ, మేఘా ఇంజనీరింగ్ అధికారులు చేశారు.

ads

గోదావరి డెల్టాకు తొలి ఫలితం..

గోదావరిలో నీటిని అప్రోచ్ కెనాల్ కు విడుదల చేయడంతో ఆ నీరు స్పిల్ వే.. రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు చేరుతుంది. అక్కడి నుంచి సెంట్రల్ డెల్టాతోపాటు తూర్పు.. పశ్చిమ కాల్వల ద్వారా గోదావరి డెల్టాను సశ్యశ్యామలం చేయనుంది. సహజంగా గోదావరిలో ప్రవహించే నీరు బ్యారేజ్ నుంచి డెల్టాకు అందుతుంది. పోలవరం పూర్తయిన తర్వాత స్పిల్ వే.. రివర్ స్లూయిజ్.. పవర్ హౌస్ డిశ్చార్జ్ ల ద్వారా బ్యారేజ్ ల నుంచి కాల్వలకు చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉండగానే నీరు గోదావరి డెల్టాకు చేరుతుండడం వల్ల పోలవరం తొలి ఫలితం అందుతున్నట్లయ్యింది.

ఛాలెంజింగ్ పనులు చేపట్టిన ‘మేఘా’..

పోలవరం నిర్మాణంలో స్పిల్ వేతో పాటు మూడు గ్యాపులు (ఈసీఆర్ఎఫ్ 1,2,3) తో పాటు జల విద్యుత్ కేంద్రం.. జల రవాణా పనులు కీలకమైనవి. ఇంజనీరింగ్ నిబంధనలకు అనుగుణంగా (వర్క్ మ్యానువల్, ప్రోటోకాల్) స్పిల్ వే పనిని మేఘా ఇంజనీరింగ్ ఛాలెంజ్ గా తీసుకొని పూర్తి చేసింది. గోదావరి నీటిని అప్రోచ్ ఛానెల్ నుంచి దిగువకు విడుదల చేయడం ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు పోలవరం దిగువన ఉన్న తాడిపూడి, పట్టిసీమ, పుష్కరం తదితర ఎత్తిపోతల పథకాల ద్వారా తాగు, సాగు నీరు ఇక నుంచి ఈ అప్రోచ్ ఛానెల్ ద్వారానే విడుదల కానుంది. దీంతో ఇక నుంచి ఏడాది పోడవునా నీటిని అప్రోచ్ ఛానెల్ ద్వారా మళ్లించి మళ్లీ పైలెట్ ఛానెల్ ద్వారా గోదావరిలోకి కలుపుతారు.

6.6 కిలోమీటర్ల మేర నది మళ్లింపు..

గోదావరి నది నీటిని 6.6 కిలోమీటర్ల మేరకు మళ్లించడమనేది అసాధారణ విషయం. సహజంగా ప్రవహించే గోదావరిని పోలవరం వద్ద కుడివైపునకు అంటే అప్రోచ్ ఛానెల్ నుంచి పైలెట్ ఛానెల్ వరకు మళ్లిస్తారు. ఇప్పుడు మొదలవుతున్న ఈ నీటి ప్రక్రియ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత కూడా అలాగే కొనసాగుతుంది. ఇందుకోసం నదీ మధ్య భాగంలో మూడు గ్యాపులు (1,2,3) నిర్మించాలి. అందులో గ్యాప్-2 గా పిలిచే ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యాం) అతిపెద్దది. 50లక్షల క్యూసెక్కుల నీటి ఒత్తిడిని తట్టుకునేలా దీనిని నిర్మిస్తారు. ఈ పని ప్రారంభం కావాలంటే నీటి ప్రవాహం నిలిపివేయాలి. అందుకోసం అప్పర్ కాఫర్ డ్యాం నిర్మించి ఈ ఏడాది వచ్చే వరదల్లో కూడా ఈసిఆర్ఎఫ్ నిర్మాణ పనులు కొనసాగించాల్సి ఉంటుంది.

వరదలను తట్టుకునేలా నిర్మాణాలు.

అప్రోచ్ ఛానెల్.. స్పిల్ ఛానెల్.. పైలెట్ ఛానెల్ పొడవు 6.6 కిలోమీటర్లు ఉంది. ఇవి ప్రధాన నదికి కుడివైపున సమాంతరంగా నిర్మించారు. అప్రోచ్ ఛానెల్ స్పిల్ వే వైపు 2.4 కిలోమీటర్లు వరకు నిర్మించారు. స్పిల్ వే నుంచి స్పిల్ ఛానెల్ 3.1కిలోమీటర్లు.. స్పిల్ ఛానెల్ చివరి నుంచి మళ్లీ గోదావరి తన సహజసిద్ధ ప్రవాహంలోకి కలిసే విధంగా 1.1 కిలోమీటర్లు పైలెట్ ఛానెల్ నిర్మించారు. ఎగువ కాఫర్ డ్యాం మూడు రీచ్ లుగా 2480 మీటర్ల పొడవు.. 42.5 మీటర్ల ఎత్తున నిర్మించారు. ఇటీవలే అప్పర్ కాఫర్ డ్యాం గ్యాపులను ప్రభుత్వ నిర్ణయానుసారం మేఘా ఇంజనీరింగ్ పూడ్చివేసింది. ఫలితంగా 30లక్షల క్యుసెక్కుల వరకు వరద వచ్చినా నదిలో నిర్మాణ పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రవాహం అప్రోచ్ ఛానెల్ మీదుగా వెళ్లిపోతుంది.

రికార్డ్ స్థాయిలో పనులు..

గోదావరి నది ప్రవాహాన్ని మళ్లించే పనులను మేఘా ఇంజనీరింగ్ రికార్డ్ సమయంలో పూర్తి చేసింది. గోదావరి ప్రవాహం కుడివైపునకు మళ్లీ స్పిల్ వేకు చేరాలంటే కనీస మట్టానికి తవ్వాలి. అందుకోసం అప్రోచ్ ఛానెల్ ను 2.4 కిలోమీటర్ల మేర తవ్వేశారు. దీంతో పెద్ద నది రూపుదిద్దుకుంది. ఇందుకోసం కోటి 54 లక్షల 88వేల మట్టి తవ్వకం పనులు చేయాల్సి ఉండగా ఇప్పటికి కోటి 4లక్షల 88వేల ఘనపు మీటర్లు పూర్తయింది. ప్రపంచంలో ఇంతవరకు అతిపెద్ద వరద డిశ్చార్జ్ స్పిల్ వే గా త్రిగాడ్జెస్ జలాశయంకు పేరుంది. దీని కన్నా పోలవరం సామర్థ్యం మూడు లక్షల క్యుసెక్కులు అధికం. దీనిని తట్టుకునేలా ప్రపంచంలోనే అతిపెద్ద గేట్లను హైడ్రాలిక్ పద్ధతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

76.29శాతం హెడ్ వర్క్స్ పనులు పూర్తి..

ప్రాజెక్టులో ఇప్పటివరకు 76.29శాతం హెడ్ వర్క్స్ పనులు పూర్తయ్యాయి. పోలవరం వరద నీటిని అప్రోచ్ ఛానెల్ మీదుగా మళ్లిస్తున్నందున పోలవరంతోపాటు పలు గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. నీటి ప్రవాహం స్పిల్ వేలో లక్ష క్యుసెక్కుల వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. 12లక్షల క్యుసెక్కులకు చేరిన తరువాత ప్రభావం కనిపిస్తుంది. కనీస ప్రవాహం ఉన్నప్పుడు తొమ్మిది ఆవాసాల్లోకి నీరు ప్రవహిస్తుంది. 28 మీటర్లు దాటిన తరువాత ముంపునకు గురయ్యే ఆవాసాల సంఖ్య పెరుగుతుంది. పూర్తి స్థాయిలో స్పిల్ వే వరకు (45.72 మీటర్లు) నీరు చేరేతే 235 ఆవాసాలు ముంపు భారీన పడతాయి. దీనికి తగ్గట్టుగానే ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసి ముంపు గ్రామాల్లోకి ప్రజలను అక్కడి నుంచి తరలిస్తుంది. ఎట్టకేలకు పోలవరం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ప్రక్రియ షూరు కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.