రాక్షసుని పాలనకు చరమగీతం : బండి సంజయ్

వరంగల్ అర్బన్ జిల్లా : ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం , ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే ఉద్యోగులకు సీఎం కేసీఆర్ పీఆర్సీ 7.5 శాతం కంటే ఎక్కువ ఇస్తానని ప్రకటించడం సిగ్గుచేటని బండి సంజయ్ అన్నారు. బీజేపీ బలపరిచిన వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ గెలుపు దిశగా వరంగల్ నగరంలోని మహేశ్వరి గార్డెన్ లో వరంగల్​ తూర్పు నియోజకవర్గం పట్టభద్రుల సమావేశంలో బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డాడు. పీఆర్సీ కోసం కొట్లాడింది మేము, నిరసనలు చేసింది బీజేపీ పార్టీ అని పట్టభద్రులు గుర్తుంచుకోవాలని బండి సంజయ్ తెలిపారు. ఆరేళ్లుగా పెంచని పీఆర్​సీ ఇప్పుడు పెంచుతానని అంటున్న కేసీఆర్​ మాటలను తెలంగాణ ఉద్యోగ సంఘాలు నమ్మొద్దన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఉద్యోగులను మభ్య పెట్టేప్రయత్నం చేస్తున్నారన్నారు. కేసీఆర్​ మాటలు విని ఉద్యోగులు మరోసారి మోసవద్దని సూచించారు. తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. బీజేపీ గెలుపుతో రాష్ట్రంలో టీఆర్​ఎస్​ పార్టీ కుప్పకూలడం ఖాయమని బండి సంజయ్​ ధ్వజమెత్తారు.  తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ బీజేపీ చేస్తున్న నిరంతర పోరాటంలో ఎంతోమంది జైలు శిక్ష అనుభవిస్తున్నారు. లాఠీ దెబ్బలకు కాళ్లు, చేతులు విరిగి చికిత్స పొందుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమైతే, హామీలను నెరవేర్చుతూ, ప్రజలకు అండగా నిలిచే ‎ప్రభుత్వమే బీజేపీ పార్టీ అని బండి సంజయ్ పేర్కొన్నారు.

ads

తెలంగాణ ఉద్యమంలో కూడా చూడని అరాచకం నేడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటయ్యాక చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే జైళ్లలో మగ్గుతూ, లాఠీ దెబ్బలకు గాయాలపాలై అవస్థలు పడుతున్న బీజేపీ కార్యకర్తల గోడును బండి సంజయ్ వివరించారు. ఒక మహిళా నాయకురాలని కూడా చూడకుండా బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మతో పాటు 53 మందిని జైలు పాలు చేసిన నీచుడు సీఎం కేసీఆర్ అని బండి సంజయ్ మండిపడ్డాడు. లాక్ డౌన్ సమయంలో కూడా ఇంటింటికి తిరిగి బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు నిత్యావసర సరుకులు అందించి సేవ చేశారని, ఫలితంగా రాష్ట్రంలో 8మంది బీజేపీ జిల్లా అధ్యక్షులు కొవిడ్ బారిన పడి కోలుకున్నారని గుర్తు చేశారు. ఇక హైదరాబాద్‎లో, వరంగల్‎లో వరదలు వస్తే నేనొచ్చాకనే డ్రామారావు వచ్చి పర్యటించారని మంత్రి కేటీఆర్‎పై బండి సంజయ్ సెటైర్లు వేశారు. వరద బాధితులకు సైతం బీజేపీ సాయం చేసిందని అన్నారు. వరదలు వచ్చినా, కొవిడ్ వచ్చినా, విద్యార్థులు చనిపోయిన, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోడు, బయటఅడుగు పెట్టడని విమర్శించారు. వివిధ రంగాల్లో ఉద్యోగులకు ప్రమోషన్లు లేక అవస్థలు పడుతున్నారు, అయినా సీఎం పట్టించుకున్న పాపాన పోలేదు.

నాలుగు సంవత్సరాల క్రితం వరంగల్ స్మార్ట్ సిటీకి బీజేపీ ప్రభుత్వం రూ.196 కోట్లు చెల్లిస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించిందని ఆరోపించారు. కేవలం రూ.40 కోట్ల రూపాయలతో డెవలప్మెంట్ చేశారు. ఇక అర్బన్ డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీ మీటింగ్ లో స్టాండింగ్ కమిటీ మెంబర్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ని ప్రశ్నించగా అసలు విషయం బయటపడిందని బండి సంజయ్ అన్నారు. కేంద్రం ప్రకటించిన రూ.196 కోట్లు చెల్లించలేదని, రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఇవ్వలేదని ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపినట్లు బండి సంజయ్ తెలిపాడు. ఫలితంగా నా పోరాటం వల్లే స్మార్ట్ సిటీ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.196 కోట్లను విడుదల చేసింది తప్ప, రాష్ట్ర ప్రభుత్వం వాటాను విడుదల చేయలేదని ఆరోపించారు. వరంగల్ కేఎంసీకి రూ.150 కోట్లు కేటాయించగా, అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.30 కోట్లు కాగా, అందులో రూ.20 కోట్లు చెల్లించలేకపోవడం వల్ల కేఎంసీ ప్రారంభానికి నోచుకోలేదని తెలిపారు. రింగురోడ్డుకు రూ.550 కోట్లు, యాదగిరి గుట్ట నుంచి వరంగల్ కు హైవే రోడ్డుకు రూ2వేల కోట్లు కేటాయించాము. కాజీపేట వ్యాగన్ ఒరాలింగ్ ఫ్యాక్టరీకి 2017లో రూ.380 కోట్లు కేటాయించాము, రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించకుండా జాప్యం చేయడం వల్లే 5వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు. అమృత్ పథకం ( మిషన్ భగీరథ ) , హ‌రిత హారం పేరుతో కంపా నిధులు కేంద్రం ఇస్తుంది. రైతు వేదికలకు కేంద్రం రూ.10 లక్షలకు ఇస్తుంది. కమ్యూనిటీ భవన్ లకు , స్వచ్ఛభారత్ పేరుతో టాయిలెట్స్ ఏర్పాటు చేస్తే, లైట్లకు , స్మశాన వాటికల ఏర్పాటుకు , డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటుకు కేంద్రం నిధులు ఇస్తుంటే మోడీ ఫోటోలు పెట్టుకోకుండా, కేసీఆర్ ఫోటోలు పెట్టి కేంద్రం నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

భైంసా ఘటనలో ఓ జర్నలిస్టుపై దాడిని బండి సంజయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఐఎం పార్టీకి చెందిన వ్యక్తులు ముగ్గురు కెమెరామెన్లపై దాడి, బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తే మాట్లాడే వాడే లేడు. హిందుత్వాన్ని మట్టుబెట్టడానికి ఎంఐఎం పార్టీ గుండాలు దాడులు చేస్తుంటే, టీఆర్ఎస్ చూస్తూ ఊరుకుంటుందని అన్నారు. ముఖ్యమంత్రి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఎంఐఎం పార్టీ గుండాలు, రాక్షసుల ‎ఆగడాలు రిపీట్ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయితే భైంసా ఘటనలో ఎంఐఎం గుండాలపై చర్యలు తీసుకోవాలని లేదంటే రాష్ట్రంలో రాక్షస పాలనను అంతమొందించడానికి ఛలో భైంసా కార్యక్రమానికి బీజేపీ సిద్ధమవుతుందని బండి సంజయ్ హెచ్చరించారు. బీజేపీ పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదని అన్నారు. రాముడు ఏలిన రాజ్యంలో రామమందిర నిర్మాణానికి 400 యేండ్లు పట్టిందని ప్రపంచ దేశాలు ఎద్దేవా చేస్తుంటే బాదేస్తుందని బండి సంజయ్ తెలిపారు. భారత దేశంలో ఇన్నేండ్ల పాటు పాలించిన పాలకుల లోపం వల్లే శ్రీరామ మందిర నిర్మాణానికి ఇంత సమయం పట్టిందని తెలిపారు. శ్రీరామ మందిర నిర్మాణానికి బీజేపీ ఎంతో కృషి అనిర్వచనీయని గుర్తు చేశారు. రామ మందిర నిర్మాణానికై చేసిన పోరాటంలో బీజేపీ కార్యకర్తలెందరో అసువులు బాసారని, గాయాలపాలయ్యారని బండి సంజయ్ తెలిపారు.