ఆక్సీజన్ కొరతపై సర్కార్ యాక్షన్ ప్లాన్

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రంగా విస్తరిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆక్సీజన్ కొరతపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రానికి అవసరమైన ఆక్సీజన్ ఎంత, ఏ మేరకు సరఫరా ఉందనే అంశంపై కసరత్తు చేస్తోంది. రాష్ట్రానికి పీక్ స్టేజ్ లో ఏ మేరకు ఆక్సీజన్ అవసరమవుతుందో అధికారులు అంచనా వేస్తున్నారు . ఏపీలో కొవిడ్ కేసులు తీవ్ర స్థాయిలోకి వస్తే సుమారు 200 టన్నుల ఆక్సీజన్ అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం రోజుకు 80 నుంచి 100 టన్నుల ఆక్సీజన్ అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రానికి 4 ప్రాంతాల నుంచి ఆక్సీజన్ రప్పించేలా ప్రణాళికలు వేస్తున్నారు.

ads

విశాఖ స్టీల్ ప్లాంట్, భువనేశ్వర్, బళ్లారి, చెన్నై నుంచి ఆక్సీజన్ సరఫరా అయ్యేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. విశాఖ నుంచి 80 , భువనేశ్వర్ నుంచి 70 టన్నుల ఆక్సీజన్ సరఫరాకానున్నాయి. ఇప్పటికే విశాఖ స్టీల్ ఆక్సీజన్ సరఫరా ప్రారంభించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. మంగళవారం రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు సంభవించాయి. యాక్టివ్ కేసులు మళ్లీ 50వేలు దాటాయి.

గడిచిన ఒక్కరోజు వ్యవధిలో 37,922 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఏకంగా 8,987 మందికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. సోమవారంతో పోలిస్తే ఒక్కరోజు వ్యవధిలోనే 3 వేలకు పైగా కేసులు అధికంగా నమోదవ్వడంతో పరిస్థితి తీవ్రతరంగా మారింది.