ఏప్రిల్ 3న “కవి సమ్మేళనాలు”

హైదరాబాద్ : స్వతంత్ర భారత అమృతోత్సవాలలో భాగంగా ఏప్రిల్ 3 న అన్ని జిల్లా కేంద్రాలతో పాటు రాష్ట్ర స్థాయిలో రవీంద్రభారతిలో “కవి సమ్మేళనాలు” నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించినట్లు రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు / మహోత్సవముల కమిటీ సభ్య కార్యదర్శి మామిడి హరికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. కవి సమ్మేళనానికి “స్వాతంత్ర స్ఫూర్తి”ని “ధీమ్” గా నిర్ణయించినట్లు తెలిపారు. 75 వ స్వాతంత్ర భారత దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా 75 వారాల పాటు నిర్వహించనున్నట్లు కేసీఆర్ ఈ నెల 12 న పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన ప్రారంభ వేడుకల్లో ప్రకటించిన విషయం తెలిసిందే. తదనుగుణంగా స్వాతంత్ర పోరాట ఘట్టాల గురించి నేటి తరం యువత, పిల్లలకు అవగాహన కల్పించుటకై స్వతంత్ర భారత అమృతోత్సవ కమిటీ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఏప్రిల్ 3 న “కవి సమ్మేళనం” నిర్వహించుటకు తగు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను కోరారు . జిల్లా కేంద్రాలలో నిర్వహించే కవి సమ్మేళనాలపై మీడియా సహకారంతో విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాలని జిల్లా పౌర సంబంధాల అధికారులకు సూచించారు.

ads