నాగోబా జాతరకు ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్​ : గిరిజనులందరికీ నాగోబా జాతర శుభాకాంక్షలు అని రాష్ట్ర గిరిజన, స్త్రీ ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం, కేస్లాపూర్ లోజరుపుకునే నాగోబా జాతర ప్రపంచంలోనే అతి పెద్ద రెండో గిరిజన జాతర అని తెలిపారు. గురువారం నాగోబా మహాపూజతో జాతర ప్రారంభమవుతుందని మంత్రి సత్యవతి వెల్లడించారు.
‘నాగోబా జాతర ఆదిమ గిరిజనుల ప్రాచీన సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. ఆచార, సంప్రదాయాలకు గిరిజనులు ఇచ్చే ప్రాముఖ్యతకు ఈ పండుగ అద్దం పడుతుందని మంత్రి సత్యవతి రాథోడ్​ అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల పండుగలు, సంప్రదాయాలకు విలువనిస్తూ సీఎం కేసీఆర్ వాటిని గొప్పగా నిర్వహిస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే నాగోబా జాతరను కూడా రాష్ట్ర ప్రభుత్వం జరుపుతోందని మంత్రి సత్యవతి పేర్కొన్నారు.

ఈ ఏడాది కరోనా నేపథ్యంలో జాతరలో నిర్వహించే గిరిజన దర్బార్, క్రీడా పోటీలను రద్దు చేసినట్లు మెస్రం వంశీయులు ప్రకటించారన్నారని మంత్రి తెలిపారు. ఆదివాసీల ఆరాధ్య దైవం ఆదిశేషును దర్శించుకునేందుకు, ఆయన ఆశీస్సులు పొందేందుకు ప్రాచీన గిరిజన వంశీయులు అక్కడికి వెళ్లేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని మంత్రి సత్యవతి స్పష్టంచేశారు.

అత్యంత విశిష్టత ఉన్న ఈ నాగోబా జాతర నేటి నుంచి వారం రోజుల పాటు కొనసాగనుందన్నారు. ఈ వారం రోజుల పాటు అక్కడి గిరిజనులకు వసతుల్లో ఎలాంటి లోటు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని మంత్రి సత్యవతి వివరించారు. వారం రోజుల పాటు అధికారులు అక్కడే ఉండి జాతరను పర్యవేక్షిస్తారని వ్యాఖ్యానించారు. మన రాష్ట్రంలోని గిరిజనులతో పాటు ఛత్తీస్​గఢ్​, మహారాష్ట్ర, జార్ఖండ్ నుంచి కూడా గిరిజనులు ఈ జాతరకు వస్తారని అన్నారు. ఇందుకోసం రవాణా సదుపాయాలు కల్పించామన్నారు.

ఆదివాసీల్లోని ఒక తెగ మెస్రం వంశీయుల ఇలవేల్పుగా నాగోబా ఉన్నారని, ఈ జాతరలో మెస్రం వంశీయులే పూజలు నిర్వహించి జాతర జరుపుతారని మంత్రి సత్యవతి పేర్కొన్నారు. గోండులు, పరదాన్, గిరిజన ఆదివాసీ తెగలంతా ఈ జాతరలో భక్తి, శ్రద్ధలతో పాల్గొంటారన్నారు. నేటి మహాపూజకు 15 రోజుల ముందు నుంచే మెస్రం వంశీయులు పరదాన్ లతో కలిసి కాలి నడకన చెప్పులు లేకుండా గోదావరి వద్దకు వెళ్తారు. అక్కడి నుంచి పవిత్ర జలాలు తీసుకొచ్చి, నాగోబా ఆలయం ముందు మర్రి చెట్టు మీద పెడుతారు. మహాపూజతో ఆ పవిత్ర జలంతో అభిషేకం చేస్తారన్నారు మంత్రి సత్యవి. మెస్రం వంశ మహిళలు అక్కడి మట్టితో లింగాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తారని పేర్కొన్నారు. ఇంతటి విశిష్టమైన జాతర తెలంగాణలో జరుగుతున్నందుకు ఎంతో గర్విస్తున్నామని’మంత్రి సత్యవతి రాథోడ్ సంతోషం వ్యక్తం చేశారు.