మావోయిస్టు మిలీషియా సభ్యుల అరెస్ట్

ములుగు జిల్లా : మావోయిస్టులకు సానుభూతిపరులుగా వ్యవహరిస్తున్న ఏడుగురు మిలీషియా సభ్యులను ములుగు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన మిలీషియా సభ్యుల నుంచి భారీ ఎత్తున మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 21న సాయంత్రం 7 గంటలకు చెలిమెల, జెల్ల, పామునూరు గ్రామానికి చెందిన మిలీషియా సభ్యులు కొంత మంది అడవుల్లో కూంబింగ్ చేస్తున్న పోలీసు పార్టీని చంపాలనుకున్నారు. ఈ మేరకు పామునూరు అటవీ ప్రాంతంలో పేలుడు సామాగ్రి అమరుస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందింది. వీళ్లంతా మావోయిస్టు పార్టీ అగ్రనాయకుల ఆదేశాల మేరకు అక్కడ సంచరిస్తున్నట్లు తెలిపారు.

ఈక్రమంలో పామునూరు అటవీ ప్రాంతంలోకి కూంబింగ్ చేస్తుండగా ఫిబ్రవరి 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో కొందరు అటవీ ప్రాంతంలో పేలుడు సామగ్రిని అమరుస్తూ కనిపించారు. పోలీసులను చూసి వారు పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. ఇందులో ఏడుగురు పేలుడు సామగ్రితో పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో వెంకటాపురం మండలం జెల్లా గ్రామానికి చెందిన మిలీషియా సభ్యులు ఉండం పాండు, మచ్చకి భీమయ్య, సోడి లక్ష్మయ్య, మడకం అలియాస్ మడవి అడమయ్య, మడవి బుద్ర, మడవి ఐతయ్య, మడవి కోస అని విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు.

వీరి నుంచి 9 ల్యాండ్‎మైన్స్, 80 మీటర్ల కార్డెక్స్‎వైర్ , మొబైల్ చార్జీలు, బ్యాటరీలు, 8 బాణాలు, బీరు, టిఫిన్ బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరిపై గతంలో పలు కేసులు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఈ సమావేశంలో ఓఎస్డీ శోభన్‎కుమార్ , ఏఎస్పీ గౌస్ ఆలం, పోలీసు అధికారులు ఉన్నారు.