ఐపీఎల్ 2021..బెంగళూరు సూపర్ విక్టరీ

ముంబై : ఐపీఎల్ 14వ సీజన్ లో మరో శతకం నమోదైంది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (101 నాటౌట్ : 52 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు ) మెరుపు సెంచరీ బాదేశాడు. ఐపీఎల్ లో అతనికే తొలి శతకం కావడం విశేషం. రాజస్థాన్ నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు వికెట్ కూడా కోల్పోకుండా ఆడుతూ పాడుతూ ఛేదించింది. బెంగళూరుకు ఇదే అత్యధిక (181) ఓపెనింగ్ భాగస్వామ్యంకావడం విశేషం. ఓపెనర్లు చెలరేగడంతో ఆర్ సీబీ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. పడిక్కల్ సెంచరీకి తోడు విరాట్ కోహ్లీ (72: 47 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ) వీరవిహారం చేయడంతో బెంగళూరు 16.3 ఓవర్లలోనే టార్గెట్ ను పూర్తి చేసింది. వరుసగా ఆడిన నాలుగు మ్యాచుల్లో గెలిచిన కోహ్లీసేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. బెంగళూరు బౌలర్లు రాణించిన పిచ్ పై రాజస్థాన్ బౌలర్లు తేలిపోయారు.

ads

అంతకు ముందు శివమ్ దూబే (46: 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ), రాహుల్ తెవాటియా (40: 23 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు ) అద్భుత ప్రదర్శన చేయడంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులు చేసింది. 43/4 తో కష్టాల్లో ఉన్న జట్టును ఈ ఇద్దరే ఆదుకున్నారు. బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ చెరో మూడు వికెట్లు తీశారు. జెమీసన్, రిచర్డ్ సన్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు. ఆరంభంలోనే బెంగళూరు బౌలర్ల దెబ్బకు జోస్ బట్లర్ (8), మనన్ వోహ్రా (7), డేవిడ్ మిల్లర్ (0), సంజూ శాంసన్ (21) పెవిలియన్ బాటపట్టారు.