సమ్మెకు సిద్ధమన్న బ్యాంకులు

ఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై బ్యాంకు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రెండ్రోజుల సమ్మెకు సిద్ధమయ్యాయి. మార్చి 15, 16 తేదీల్లో సమ్మె చేపట్టనున్నట్లు 9 బ్యాంకు సంఘాల ఐక్యవేదికగా ఏర్పాటైన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ( యూఎఫ్‎బీయూ) వెల్లడించింది. ఈ 9 సంఘాల నేతలు మంగళవారం సమావేశమై బడ్జెజ్‎లో కేంద్రం ప్రకటించిన సంస్కరణల అంశంపై చర్చించారు.

2021, ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‎ను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్లు ఆమె ప్రతిపాదించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించినట్లు ఆలిండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ ( ఐఏబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ . వెంకటాచలం తెలిపారు. బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణల అంశాలపై చర్చించినట్లు ఆయన చెప్పారు. ఐడీబీఐ బ్యాంకు, మరో రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ, బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు, ఎల్ ఐసీ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ, భీమా రంగంలోకి 74 శాతం మేర ఎఫ్ డీఐలకు అనుమతి, పెద్ద ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు ఆయన వివరించారు.

ఈ సమావేశంలో అన్ని అంశాలపై చర్చించిన అనంతరం మార్చి 15, 16 తేదీల్లో సమ్మెకు పిలుపునివ్వాలని నిర్ణయించినట్లు ఏఐబీఓసీ ప్రధాన కార్యదర్శి సౌమ్యాదత్తా తెలిపారు. ఈ సమావేశంలో ఆలిండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), ఆలిండియా బ్యాంకు ఆఫీసర్స్ కన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంకు ఎంప్లాయిస్ (ఎస్ సీబీఈ), ఆలిండియా బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ ) , బ్యాంకు ఎంప్లాయిస్ కన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ), ఇండియన్ నేషనల్ బ్యాంకు ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఐఎన్ బీఈఎఫ్ ), ఇండియన్ నేషనల్ బ్యాంకు ఆఫీసర్స్ కాంగ్రెస్ ( ఐఎన్బీఏసీ), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంకు వర్కర్స్ (ఎన్ ఓబీడబ్ల్యూ) , నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంకు ఆఫీసర్స్ (ఎన్ ఓబీఏ ) సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.