ఆటగాళ్లకు బీసీసీఐ పిలుపు

ముంబై : దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్న పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ ఆటగాళ్లు మార్చి 1న అహ్మదాబాద్ లో రిపోర్ట్ చేయాలని బీసీసీఐ కోరింది. ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. మార్చి 12 నుంచి అహ్మదాబాద్ వేదికగా ఆరంభమయ్యే టీ20 సిరీస్ కు శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ తెవాటియా, భువనేశ్వర్ కుమార్ తదితర ఆటగాళ్లు ఎంపికయ్యారు.

విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్న క్రికెటర్లు ప్రస్తుతం ఐదు నగరాల్లో ఏర్పాటు చేసిన బయో బబుల్స్ లో ఉన్నారు. మొతేరా స్టేడియంలో మార్చి 12 నుంచి 20 వరకు టీ20 సిరీస్ జరుగనుంది. ఆ తర్వాత మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ పుణే వేదికగా మార్చి 23 నుంచి 28 మధ్య జరుగనుంది.