ఒలింపిక్స్ లో క్రికెట్ కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్

ముంబై : ఎన్నాళ్లుగానో ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ ఒలింపిక్స్ లో క్రికెట్ కు నో చెబుతూ వస్తోంది. కారణం తాము ఎక్కడ స్వతంత్రత కోల్పోతామో, ఇండియన్ ఒలింపిక్ కమిటీకి ఎక్కడ జవాబుదారీగా ఉండాల్సి వస్తుందో అన్న ఆందోళన . కానీ ఇప్పుడు బోర్డు తీరులో మార్పు కనిపిస్తోంది. తాజాగా ఒలింపిక్స్ లో క్రికెట్ కు బీసీసీఐ సానుకూలంగా స్పందించడం విశేషం. చివరిసారి 1900లో జరిగిన ఒలింపిక్స్ లో క్రికెట్ కూడా ఉంది. ఆ తర్వాత ఈ మెగా స్పోర్టింగ్ ఈవెంట్ లో జెంటిల్మన్ గేమ్ కు చాన్స్ దక్కలేదు. 2028లో లాస్ ఏంజిల్స్ లో జరుగబోయే ఒలింపిక్స్ లో క్రికెట్ కోసం ఐసీసీ ప్రయత్నిస్తోంది. అయితే దీనికి ఇన్నాళ్లూ బీసీసీఐ అడ్డు చెబుతూ వచ్చింది.

ads

తాజాగా ఐసీసీతో జరిగిన సమావేశంలో బీసీసీఐ మెత్తబడింది. ఒలింపిక్స్ లో క్రికెట్ అవకాశం కోసం ప్రయత్నిస్తున్నట్లు బోర్డు కోశాధికారి అరుణ్ సింగ్ ధుమాల్ చెప్పారు. మాకు ఆసక్తిగానే ఉంది. అయితే దీనికి సంబంధించిన విధివిధానాల దిశగా పని చేయాల్సి ఉంది అని ధుమాల్ చెప్పారు. అంతేకాదు ఇప్పటికే వచ్చే ఏడాది జరుగబోయూ కామన్వెల్త్ గేమ్స్ కు మహిళల టీంను పంపండానికి కూడా బోర్డు అంగీకరించింది.