రసవత్తర పోరుకు బెంగాల్ రెడీ

కోల్‎కతా : రేపు జరుగనున్న తొలి దశ ఎన్నికలకు పశ్చిమ బెంగాల్ సిద్ధమైంది. ఇప్పటికే బీజేపీ తరపున ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లు పర్యటించి కూడా ఇక్కడ ప్రచారం చేశారు. బీజేపీ, టీఎంసీలు ఈ జిల్లాల్లో తీవ్ర స్థాయిలో ప్రచారం నిర్వహించాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా ఇక్కడ జోరుగా ప్రచారం నిర్వహించారు. అసలైన మార్పును తీసుకువస్తామని, బంగారు బెంగాల్‎ను తయారు చేస్తామని మోడీ ఓ సభలో పేర్కొన్నారు. శారదా స్కామ్, ఇతర కుంభకోణాల్లో అక్రమార్కులను సీఎం మమతా బెనర్జీ వదిలేసినట్లు బీజేపీ నేతలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ స్కీంలను అమలు చేయడంలో దీదీ విఫలమైందని పేర్కొన్నారు. పేద, గిరిజన, దళితులను ఆదుకోలేదన్నారు. టీఎంసీ పాలనలో కమీషన్లు రాజ్యమేలినట్లు ఆరోపించారు. జంగల్ మహల్, బంకురా స్థానాల్లో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ప్రచారం చేశారు.

ads

మరోవైపు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా జోరుగా ప్రచారం నిర్వహించారు. తొలి దశ ఎన్నికలు జరుగనున్న 30 నిమోజకవర్గాల్లో పర్యటించారు. అన్ని చోట్లా ఆమె ర్యాలీలు నిర్వహించారు. ఎడమకాలికి గాయం తగిలినా, ఆమె మాత్రం నిర్విరామంగా ప్రచారంలో పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజావ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. కరోనా టీకాలను ఉచితంగా ఇవ్వకుండా మోడీ ప్రభుత్వం అడ్డుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. బీజేపీలో చేరిన సీపీఐ గూండాలు తనపై నందీగ్రామ్ లో దాడి చేసినట్లు ఆమె అన్నారు. ఖేలా హోబే అన్న నినాదంతో ఆమె ప్రజల వద్దకు వెళ్లారు. టీఎంసీ తరపున ఎంపీ అభిషేక్ బెనర్జీ మరో స్టార్ క్యాంపేనర్ రూంలో ప్రచారం నిర్వహించారు. బెంగాల్ స్వంత కూతురికి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. బెంగాల్ లో మొత్తం 8 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.

అయితే రసవత్తర పోరుకు సిద్ధమైన బెంగాల్ లో హై వోల్టేజ్ ప్రచారం తర్వాత రేపు ఎన్నికలు జరుగనున్నాయి. తొలి దశలో 30 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆ స్థానాలు ఉన్న ప్రాంతంలో గిరిజన ప్రాబల్యమే ఎక్కువగా ఉంది. పురులిమా, బంకురా, జార్ గ్రామ్, పుర్బా మెద్నిపూర్, పశ్చిమ్ మెద్నిపూర్ జిల్లాల్లో ఈ స్థానాలు ఉన్నాయి. ఒకప్పుడు లెఫ్ట్ పార్టీలకు అడ్డా అయిన ఈ నియోజకవర్గాల్లో ఈ సారి ఎవరి ఆధిపత్యం కొనసాగుతోందో వేచి చూడాల్సి ఉంది.