కోల్‌కతా: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పశ్చిమ బెంగాల్ ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీచేసింది. సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ వేసిన పరువు నష్టం దావా కేసులో ఈ సమన్లు ఇచ్చింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని అమిత్ షాకు సూచించింది. వ్యక్తిగతంగా లేదా లాయర్ ద్వారా సోమవారం 10గంటలకు కోర్టుకు హాజరు కావాలని ఎంపీ/ఎమ్మెల్యే న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశించారు.
2018 ఆగస్టు 11న కోల్‌కతాలో జరిగిన ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎంపీ అభిషేక్ బెనర్జీ పరువుకు నష్టం కలిగించేలా అమిత్ షా వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ అభిషేక్ తరఫు న్యాయవాది సంజయ్ బసు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం అమిత్ షా బెంగాల్ పర్యటనలోనే ఉన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న బెంగాల్‌కు విచ్చేసిన ఆయన ఐదో విడత పరివర్తన్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మమతా బెనర్జీ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏప్రిల్/మే నెలల్లో బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీ , తృణమూల్ కాంగ్రెస్ మధ్య గత కొంత కాలంగా తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.