మార్చి 26న భారత్ బంద్


న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రైతులు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. మార్చి 26న పూర్తి స్థాయిలో ‎”భారత్ బంద్‎కు” రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. మార్చి 26నాటికి తమ ఉద్యమానికి నాలుగు నెలలు పూర్తయిన నేపథ్యంలో రైతు సంఘాల నేతలు భారత్ బంద్‎కు పిలుపునిచ్చారు.‎ అయితే అసోం, వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ప్రారంభంకానున్న ముందు రోజే భారత్ బంద్‎కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. మార్చి15న ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ మరియు ఆయిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ, ట్రేడ్ యూనియన్లు ఆందోళన చేయనున్నట్లు రైతు సంఘం సన్కుక్త్ కిసాన్ మోర్చా తెలిపింది.

ads

ఇక, మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేసే వరకు తాము ఆందోళన విరమించబోమని రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ గతవారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కొత్త చట్టాల వల్ల కార్పొరేట్ల దయతో తాము బతికే పరిస్థితి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవితాలను కొత్త చట్టాలు నాశనం చేశాయని వారు ఆందోళన చెందుతున్నారు. అయితే వ్యవసాయ చట్టాల విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 11 సార్లు రైతు నేతలతో చర్చలు జరిపింది. అయితే, చట్టాలు రద్దు చేయాలని రైతులు పట్టుబడుతుండగా, రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్రం చెబుతుండటంతో 11 రౌండ్ల చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. ఈ చట్టాలతో రైతులకు వచ్చిన నష్టం ఏమీ లేదని, ఇంకా రైతులకు లాభమే కలుగుతుందని కేంద్రం చెబుతోంది.