బీజేపీ కుట్రతోనే ఢిల్లీలో హింస

న్యూ ఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ రిపబ్లిక్ డే దినోత్సవం నాడు ఢిల్లీలో రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో పక్కా కుట్రతోనే హింస చెలరేగిందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. శాంతియుతంగా కొనసాగుతున్న రైతుల ఉద్యమంపై బురదజల్లడానికే పక్కా ప్లాన్ తో కుట్ర చేశారని ఆయన కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

జనవరి 26న ఘాజీపూర్ సరిహద్దుల్లో రైతుల ట్రాక్టర్ ర్యాలీకి అనుమతించిన మార్గంలో పోలీసులు బారీకేడ్లను అడ్డంపెట్టారని, దాంతో రైతులకు, పోలీసులకు మధ్య ఘర్షన చోటుచేసుకుందని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఆ ఘర్షణే తర్వాత మరింత హింసకు దారితీసిందన్నారు. ఆందోళనకారుల్లో హింసకు పాల్పడిన 15 మందిని రైతులు పట్టుకున్నారని, వారి దగ్గర ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉన్నాయని దిగ్విజయ్ చెప్పారు. దీన్ని బట్టి ప్రభుత్వంలో ఎలాంటి వ్యక్తులు ఉన్నారో మీరే గమనించాలని మీడియాను ఉద్దేశించి దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.