బీజేపీ పతనం ప్రారంభమైంది…

వరంగల్ : రాష్ట్రంలో, దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నాడు రైల్వే ప్లాట్ ఫారం మీద టీ అమ్మిన నేటి ప్రధాని మోడీ ఆ రైల్వేను అమ్మేశాడని మంత్రి మండిపడ్డారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తే ఇక ఉద్యోగాలు ఎలా వస్తాయని, యువత కేంద్ర ప్రభుత్వ తీరును గమనించాలని ఆయన సూచించారు. బీజేపీ రెచ్చగొట్టి విద్యార్థి బోడ సునిల్ నాయక్ ఉసురు తీసిందని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు. పైగా టీఆర్ఎస్ పై బీజేపీ ఆరోపణలు చేస్తుండటం సిగ్గుచేటని అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని హన్మకొండ ఎస్వీ కన్వెన్షన్ హాల్ లో ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు , సత్యవతి రాథోడ్ లు పాల్గొనగా, అతిథులుగా ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్లు సంఘం సుందర్ రాజ్ యాదవ్, జనాగర్ధన్ గౌడ్, తాజా మాజీ కార్పొరేటర్లు బోడ డిన్న, మిడిదొడ్డి స్వప్న, సిరంగి సునీల్, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నలబోల సతీష్, ఉడుతల సారంగపాణి, తదితరులు పాల్గొన్నారు.

ads

బీజేపీపై మంత్రుల ఫైర్…
మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించిన ప్రతీ ఒక్కరికీ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు థ్యాంక్స్ చెప్పారు. ఎగిరెగిరి పడ్డ వాళ్ళను ప్రజలు దభేల్ మని పడేశారు. నేలకు వేసి కొట్టారు అంటూ బీజేపీ పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కన్నతల్లి లాంటి టీఆర్ఎస్ పార్టీని అలిగి సాధించుకోవాలి తప్ప, అన్యాయం చేయొద్దని మంత్రి కార్యకర్తలకు సూచించారు. పార్టీ కార్యకర్తలకు పదవులు కావాలని సీఎం అడిగితే వెంటనే ఒప్పుకున్నాడని, త్వరలోనే కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించినట్లు తెలిపారు. ఉగాది నుంచి ఇంటింటికి మంచినీరు అందించబోతున్నామని, ఈ మహత్తర కార్యక్రమాన్ని ఈనెల 14న మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. అంతే కాకుండా ప్రతీ ఒక్క కుటుంబానికి కనీసం రూ. 5లక్షల లబ్ధి చేకూరే విధంగా ఎంపవర్మెంట్ స్కీంని త్వరలోనే ప్రారంభిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పార్టీ అధిష్ఠానం నిర్ణయించే అభ్యర్థులందరినీ గెలిపించాలి కోరారు. బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని, ఆ పార్టీల అడ్రస్ లేకుండా చేయాలని మంత్రి కోరారు. పార్టీని విజయ పథంలో నడిపే బాధ్యత పార్టీ కార్యకర్తలదే అని మంత్రి ఎర్రబెల్లి మరొక సారి సూచించారు.

ప్రతీ నెలా కార్యకర్తల ఆత్మీయ సమావేశాలు పెట్టి, వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకునే మంచి సంప్రదాయాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ , ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కొనసాగిస్తుండటం మంచి నిర్ణయమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు ఆత్మీయుడిగా వినయ్ భాస్కర్ ఉండటం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజల అదృష్టం అని పేర్కొన్నారు. చిల్లర రాజకీయాలు చేస్తున్న కొన్ని పార్టీలను ప్రజలు, కార్యకర్తలు తిప్పి కొట్టాలని ఆమె హితవు చేశారు.
ఆంధ్రాలో భూమి కేటాయించకున్నా గిరిజన యూనివర్సిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణలో మాత్రం భూములు కేటాయించినప్పటికీ అటు కోచ్ ఫ్యాక్టరీ, ఇటు గిరిజన యూనివర్సిటీ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణపై వివక్షత చూపుతున్న బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పి, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చూపించాలని మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు.

ఈనెల 14న వరంగల్ కు మంత్రి కేటీఆర్ ..
గ్రేటర్ వరంగల్ లో బీజేపీ నేతలకు తిరిగే ముఖం లేదు కాబట్టే ముసుగులు వేసుకొని తిరుగుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. కోచ్ ఫ్యాక్టరీ తేకుండా వరంగల్ కు వచ్చే బీజేపీ నాయకులను ప్రజలు అడుగుపెట్టనివ్వరని హెచ్చరించారు. ఈనెల 14న మంత్రి కేటీఆర్ వరంగల్ లో పర్యటిస్తారని, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసి, అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు.
అలాగే త్వరలో జరుగనున్న మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలపై పార్టీ శ్రేణులతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన రజక, నాయి బ్రాహ్మణులకు వినయ్ భాస్కర్ ధన్యవాదాలు తెలిపారు.

టీఆర్ఎస్ కు బీజేపీ పోటీ కాదు..
వచ్చే ఎన్నికల్లో టీఆరెఎస్ విజయ కేతనం ఎగిరేలా చేయాలని, చిల్లరమల్లరగా వ్యవహరిస్తున్న పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని ఎంపీలు పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. వచ్చే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ పోటీ కాదు. కాంగ్రెస్ పార్టీకి ఆ స్థాయి లేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆ రెండు పార్టీలను మట్టి కరిపించి, వరంగల్ కార్పొరేషన్ ని సీఎం కేసీఆర్ కి కానుకగా ఇవ్వాలని వారు కోరారు.

పార్టీ దిశా నిర్దేశాల మేరకు కార్యకర్తలు, నాయకులు పని చేయాలని పార్టీ ఉమ్మడి జిల్లా ఇంఛార్జి బాల మల్లు అన్నారు. పార్టీ సభ్యత్వాల నమోదులో మంచి ప్రతిభ కనబరచిన 36వ డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ కి అభినందనలు తెలిపారు. వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వరంగల్ లో మరోసారి పార్టీ జెండా ఎగరాలని , ఆ దిశగా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు.

ఇక మొన్నటి వరకు నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదులో పశ్చిమ నియోజకవర్గంలో మొదటి స్థానంలో నిలిచిన 50 వ డివిజన్, రెండవ స్థానంలో నిలిచిన 39వ డివిజన్ కార్పొరేటర్లను ఈ సమావేశంలో అభినందించారు. ఈ సమావేశంలో భాగంగా కొత్త, పాత 31వ డివిజన్ లలో ఉదయ్ కుమార్, సాయి తదితరుల నేతృత్వంలో భారీ ఎత్తున బీజేపీ నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. వారికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.