సునిల్ నాయక్ మృతి..వెల్లువెత్తిన నిరసనలు


ఉమ్మడి వరంగల్ : నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ మార్చి 26న కేయూ విద్యార్థి బోడ సునిల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని గమనించిన తోటి విద్యార్థులు వరంగల్ లోని ఓ ప్రైవేట్ కు తరలించగా, పరిస్థితి విషమించడంతో ఇటీవలే బోడ సునిల్ ను హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. ఈక్రమంలోనే శుక్రవారం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

ads

సునిల్ మృతితో వరంగల్ అర్బన్ జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సునిల్ మరణవార్త తెలియగానే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటిని టీజీవీపీ, ఏబీఎస్ఎఫ్, డీఎంఎస్ఏ, పీడీఎస్ యూ, ఎన్ఎస్ యూఐ, కేయూ జాక్ నాయకులు నేతలు ముట్టడికి యత్నించారు. పలువురు నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇక మృతుడు సునిల్ నాయక్ పార్థీవదేహాన్ని హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామ పరిధిలోని రామ్ సింగ్ తండాకు తరలించిన క్రమంలో అడుగడుగునా నిరసనకారులు పోలీసుల నిర్భంధానికి గురయ్యారు. దీంతో బోడ సునిల్ నాయక్ మృతదేహం వద్ద విద్యార్థి,ఉద్యమ నాయకులు ధర్నా చేశారు.

సునిల్ నాయక్ పార్థీవదేహానికి కడసారి నివాళులర్పించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన వారిని మహబూబాబ్ జిల్లా పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ సునిల్ కుటుంబాన్ని అన్ని రకాల ఆదుకోవడమే కాకుండా సునిల్ మరనిస్తూ డిమాండ్ చేసిన ఉద్యోగ ప్రకటన వెంటనే చేయాలని, అప్పటి వరకు భీష్మించుకు కూర్చున్నారు. విలపిస్తున్న సునిల్ నాయక్ తల్లి మల్లిక, తండ్రి రాంధన్ , కుటుంబసభ్యులను నాయకులు ఓదార్చారు. ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకుని కూర్చుకున్నారు.

దీంతో సంఘటనా స్థలానికి వచ్చిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ప్రభుత్వం తరపున నాయకులను, నిరసన కారులను బుజ్జగించారు. మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పినట్లు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, దహన సంస్కారాల ఖర్చు కొరకు ఒక లక్ష రూపాయలు ఇస్తామని గిరిజన సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఎస్పీ చెప్పగా కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు దానికి ఒప్పుకోలేదు. సునిల్ చనిపోయింది తన కోసం కాదని తన లాంటి నిరుద్యోగుల కోసమని మూడు డిమాండ్లు ప్రభుత్వం ప్రకటించేవరకు ఇక్కడి నుండి వెళ్ళేది లేదని అన్నారు. సునిల్ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, ఎంటెక్ చదివిన సునిల్ సోదరునికి ఆఫీసర్ ఉద్యోగం ఇవ్వాలని, సునిల్ కోరినట్లుగా ఉద్యోగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

ధర్నాలో ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు దనసరి సీతక్క, కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు కూచన రవళి, తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ వరంగల్ పార్లమెంటు కన్వీనర్ సాయిని నరేందర్, బహుజన లెఫ్ట్ పార్టీ వరంగల్ జిలా అధ్యక్షుడు చింతకింది కుమారస్వామి, బి.ఎల్.ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పటేల్ వనజక్క, నాయకుడు సూరం నిరంజన్, పీపుల్స్ డెమోక్రాటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు సోమ రామమూర్తి, ఎం.సి.పి.ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి గాదెగోని రవి, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్, లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు పోరిక ఈశ్వర్ సింగ్, యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ధర్నాలో పాల్గొన్నారు.

మరో వైపు కేయూ విద్యార్థి సునీల్ అంత్యక్రియలకు కాటారం నుండి బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ డాక్టర్ వివేకానంద వెంకటస్వామి గారు, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ లను పోలీసులు అడ్డుకున్నారు. భూపాలపల్లి మండలం బాంబుల గడ్డ వద్ద వీరిని పోలీసులు అడ్డుకున్నారు. కాన్వాయ్ ని పోలీస్ ఎస్కార్ట్ తో భూపాలపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.