టీఆర్ఎస్ పార్టీకే బ్రాహ్మణ సంఘాల మద్దతు

వరంగల్ అర్బన్ జిల్లా : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్థులకు మద్దతునిచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని, గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. మంగళవారం హన్మకొండ హంటర్ రోడ్ లోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు నివాస గృహంలో బ్రాహ్మణ సంఘాల ఆత్మీయ సమావేశం జరిగింది. దీనికి హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ తో పాటు బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. సీఎం కేసీఆర్ బ్రాహ్మణుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ వాణీదేవి అన్నారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేసి రూ. 165 కోట్ల నిధులు కేటాయించారని వెల్లడించారు. నిరుపేద బ్రాహ్మణులు స్వయం ఉపాధితో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు రుణాలు మంజూరు చేసారని ఎమ్మెల్సీ వాణీదేవి గుర్తు చేశారు. అలాగే నిరుపేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు వివేకానంద ఓవర్సేస్ స్కాలర్ షిప్ లు అందజేశారని, ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు రామానుజ స్కాలర్ షిప్ ద్వారా రుణాలు అందించారని వెల్లడించారు.

ads

బ్రాహ్మణులకు ఆరోగ్య బీమా పథకం ద్వారా ఉచితంగా చికిత్సలు జరిగేలా చేసారని, ఈ పథకం ద్వారా చాలా మందికి లబ్ది చేకూరిందని తెలిపారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న బ్రాహ్మణులను ఆదుకునేందుకు ధూప దీప నైవేద్యం పథకం ద్వారా వస్తున్న మొత్తాన్ని రూ. 2500 నుండి రూ. 6000 కు పెంచారని అన్నారు. వరంగల్ నగరంలో స్వయం ఉపాధి కింద రూ. 4 కోట్ల 75 లక్షలు ఇప్పటికే మంజూరు చేసి వందల కుటుంబాలకు అండగా ప్రభుత్వం నిలిచిందని తెలిపారు. సీఎం కేసీఆర్ బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఏ రాష్ట్రంలో చేయని విధంగా వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ప్రశంసించారు. బ్రాహ్మణులకు అన్ని అంశాల్లో పెద్దపీట వేస్తున్నారని, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బ్రాహ్మణులు ఎదిగేందుకు తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో బ్రాహ్మణ సంఘాలు టీఆరెస్ పార్టీకి మద్దతు నివ్వడం హర్షణీయమని, అన్ని డివిజన్లలో టీఆరెస్ అభ్యర్థుల గెలుపుకు అలాగే గ్రేటర్ పీఠం పై గులాబీ జెండా ఎగుర వేసేందుకు బ్రాహ్మణులు కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు కుసుంబ సీతారామారావు, గంగు ఉపేంద్ర శర్మ, వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ, కుడా మాజీ చైర్మన్ దండపంతుల హరిహర ప్రసాద్, వల్లూరి పవన్ కుమార్, ఎరబాటి వామన్ రావు, పీవీ మదన్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.

వరంగల్ నగరంలో బ్రాహ్మణ సంక్షేమ భవనం కోసం వెయ్యి చదరపు అడుగుల స్థలం ఉచితంగా ఇస్తానని మాజీ కార్పొరేటర్, న్యాయవాది వద్దిరాజు గణేష్ ఈ సందర్బంగా హామీ ఇచ్చారు. గ్రేటర్ వరంగల్ లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. భద్రకాళి దేవస్థానం ప్రధాన అర్చకులు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సభ్యులు శేషు శర్మ మాట్లాడుతూ బ్రాహ్మణ సంక్షేమ భవన నిర్మాణం కోసం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నుండి రూ. 80 లక్షల మంజూరుకు కృషి చేస్తానని వెల్లడించారు.

బ్రాహ్మణ సంఘాల ఆత్మీయ సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ సురభి వాణీదేవిని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు, వొడితల కుటుంబ సభ్యులు వొడితల సరోజినీ దేవి, ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, డా.షమిత దంపతులు, ఇంద్రనీల్, పూజిత తదితరులు ఘనంగా సన్మానించారు.