పీఆర్సీ పెంపుకు కేబినెట్ ఆమోదం

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు పంపించింది. పీఆర్సీని ఆమోదిస్తూ మంగళవారం రాష్ట్ర సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. జూన్ నెల నుంచి కాంట్రాక్ట్ , జౌట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన పీఆర్సీకి అనుగునంగా వేతనాలు విడుదల చేయాలని నిర్ణయించింది. కేబినెట్ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి 9, 21,037 మంది ప్రయోజనం చేకూరనున్నది. ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీని ప్రకటిస్తూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

ads

పెంచిన పీఆర్సీ వేతనాన్ని జూన్ నెల నుంచి అమలు చేసి చెల్లించాలని నిర్ణయించింది. 2018 జూలై 1 నుంచి నోషనల్ బెనిఫిట్, గత సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మానిటరీ బెనిఫిట్, ఈ సంవత్సరం 1 నుంచి క్యాష్ బెనిఫిట్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ విషయమై ఉత్తర్వులను జారీ చేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. గత సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఈ యేడాది మే 31 వరకు పెన్షనర్లకు చెల్లించాల్సిన ఏరియర్స్ ను 36 వాయిదాల్లో చెల్లించాలని కూడా నిర్ణయించారు.