దీప్ సిద్దూపై కేసు నమోదు !

న్యూ ఢిల్లీ : కిసాన్ ర్యాలీ హింస కేసులో పంజాబ్ నటుడు దీప్ సిద్దూపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. త్వరలోనే అతనికి నోటీసులు పంపి విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే కిసాన్ ర్యాలీలో హింసకు కారణం దీప్ సిద్దూనే అని పలువురు రైతులు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు అతనే బాధ్యుడు అని పేర్కొన్నారు. కిసాన్ ర్యాలీలో చోటు చేసుకున్న హింసపై ఢిల్లీ పోలీసులు 25 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసి దర్యాప్త చేపట్టారు.

ఈ కేసుల విచారణలో భాగంగా 19 మందిని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. మొత్తం 394 మంది పోలీసులకు గాయాలైనట్లు వెల్లడించారు. 50 మందిని నిర్బంధిచామని పేర్కొన్నారు. 300 ట్విట్ట్ అకౌంట్లను సీజ్ చేసి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న శాంతియుత ఉద్యమాన్ని నాశనం చేసేందుకు నటుడు దీప్ సిద్ధూ వంటి సంఘ విద్రోహ శక్తులు కుట్ర పన్నాయని సంయుక్త కిసాన్ మోర్చా ఆరోపించింది. ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణకు దీప్ సిద్ధూ, కిసాన్ మజ్ధూర్ సంఘర్ష్ కమిటీనే కారణమని పేర్కొంది. ట్రాక్టర్ ర్యాలీలో హింస నేపథ్యంలో వచ్చేనెల ఫిబ్రవరి 1 న నిర్వహించాల్సిన పార్లమెంట్ మార్చ్ ను రద్దు చేస్తున్నట్లు రైతు నేతలు ప్రకటించారు. జనవరి 30న గాంధీజీ వర్ధంతి సందర్భంగా నిరాహార దీక్ష చేపడతామన్నారు.