సీబీఎస్ఈ పరీక్షలపై కేంద్రం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ : కరోనా కోసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దు చేసింది. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. పదో తరగతి ఫలితాలను బోర్డు తయారు చేయబోయే కొన్ని ప్రమాణాల ఆధారంగా సిద్ధం చేయనున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలను రద్దు చేయాలన్న డిమాండ్ల నేపథ్యంలో ఉన్నతాధికారులతో ప్రధాని మోడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీలతో పాలు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ads

జూన్ 1న బోర్డు అప్పటి పరిస్థితులను సమీక్షించి 12వ తరగతి పరీక్షలను తర్వాత నిర్వహించాలని నిర్ణయించారు. 12వ తరగతి పరీక్షలు మే 4 నుంచి జూన్ 14 వరకు జరగాల్సి ఉంది. ఇప్పుడవి వాయిదా పడ్డాయి. పరీక్షలు తిరిగి నిర్వహించే ముందు కనీసం 15 రోజుల ముందు నోటీసు ఇవ్వనున్నారు. ఇంటర్నల్ అసెస్మెంట్ ఆధారంగా పదో తరగతి విద్యార్థులను ప్రమోట్ చేస్తామని విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ వెల్లడించారు. ఒకవేళ ఎవరైనా విద్యార్థి అసెస్మెంట్ పై అసంతృప్తిగా ఉంటే అలాంటి వారికి పరిస్థితులు మెరుగుపడిన తర్వాత పరీక్షలు రాయవచ్చని కూడా ఆయన వెల్లడించారు.

కోరలు చాస్తున్న కరోనాను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం కీలక సమావేశం నిర్వహించారు. విద్యార్థుల శ్రేయస్సే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని మోడీ చెప్పారని ఈ భేటీకి హాజరైన విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్ తెలిపారు. అనంతరం టెన్త్‌ పరీక్షలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.