మంత్రుల డిమాండ్ కు స్పందించిన కేంద్రం

ఢిల్లీ : తెలంగాణలో పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టాల్సిందిగా రాష్ట్రం అందచేసిన ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు, తదితర అంశాలపై విన్నవించేందుకు రాష్ట్ర ప్రతినిధుల బృందం ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా గురువారం ఢిల్లీలోని శాస్త్రి భవన్ లో కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి రాఘవేంద్ర సింగ్, ఆర్కియాలజీ డీజీ విద్యావతితో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, వి.శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు బండ ప్రకాష్, వెంకటేష్ నేత, మాలోతు కవిత సమావేశమయ్యారు. రాష్ట్రంలోని స్మారక చిహ్నాలు, కోటల అభివృద్ధి పనులను చేపట్టాలని, వరంగల్, కరీంనగర్ లలోని మ్యూజియంల నవీకరణ, పునర్నిర్మాణం, పునరుద్ధరణ ప్రతిపాదనలను చేపట్టాలని అధికారులను ప్రతినిధి బృందం కోరింది.

ads

గోల్కొండ సౌండ్ లైట్ షోను ప్రస్తుత స్థలం నుండి చక్కగా విస్తృతంగా కనిపించే క్రొత్త స్థలానికి మార్చే పనులు వేగం చేయాలన్నారు. మహబూబ్‌నగర్‌లోని సాంస్కృతిక సముదాయం అభివృద్ధికిగాను కేంద్ర ఆర్థిక సహాయం రూ .15 కోట్లు మంజూరుచేయాలని ప్రతినిధి బృందం అభ్యర్థించింది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్, వరంగల్ , హైదరాబాద్ నగరాల్లో మ్యూజింయంలు ఏర్పాటు చేయాలని విన్నవించారు. అదేవిధంగా గోల్కొండ కోటలో సౌండ్ అండ్ లైటింగ్ షో వేదిక మార్చాలని కోరారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కల్చరల్ ఆడిటోరియం ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించారు.

అనంతరం మంత్రులు మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సాంస్కృతిక వైభవం కోసం కృషి చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెల్పారు. తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి అత్యధిక పన్నులు చెల్లిస్తున్నా ఆశించినంతగా సహకారం రావడంలేదన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కేంద్రం ఒక్క జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదన్నారు.

రామప్ప దేవాలయానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు రావాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఖిలా వరంగల్, వేయిస్థంభాల ఆలయ అభివృద్ధి పనులు ముందుకు సాగడంలేదన్నారు. చరిత్ర కల్గిన దేవాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరినట్లు తెలిపారు. నిధుల విడుదల , పనుల వేగం పెంచాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. సర్ధార్ పాపన్నకోట, జఫర్గడ్ కోట, పాలకుర్తి బమ్మెర పోతన సమాధుల అభివృద్ధి, పాలకుర్తి ఆలయాభివృద్ధి చేయాలని కోరినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు.

యునెస్కో పంపిన సాంకేతిక నిపుణుడు కూడా రామప్ప ఆలయం గుర్తింపునకు అవకాశం ఉందన్నారు ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి. యునెస్కో సమావేశం త్వరలోనే ప్యారిస్ లో జరుగబోతోంది అన్నారు. ఎలాగైనా ఈ సారి రామప్పకు యునెస్కో గుర్తింపు లభించేలా కేంద్రంతో కలిసి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అన్ని అంశాలపై వారు సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.