ఓటమి భయంతోనే జగన్నాటకాలు

అమ‌రావ‌తి ‌: ఓటమి భయంతోనే జగన్నాటకాలు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం టీడీపీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘పంచాయతీ ఎన్నికలను ప్రతి టీడీపీ కార్యకర్త , నాయకుడు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. గత మార్చిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లలో వైసీపీ అరాచకాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆ రోజు కూడా మనం వీరోచితంగా పోరాడాం. 25% పైగా ఏకగ్రీవాలు బలవంతంగా చేశారు. బెదిరించి, ప్రలోభ పెట్టి అధికారులను లొంగదీసుకుని అరాచకాలు చేశారు. కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుపడ్డారు. సర్టిఫికెట్ల కోసం వెళ్తే భౌతికదాడులకు పాల్పడటం, నామినేషన్ పేపర్లు బలవంతంగా లాక్కోవడం, అధికారుల ఎదుటే దౌర్జన్యాలు చేశారు. కిడ్నాప్ లకు పాల్పడటం, హత్యాయత్నాలు, వైసీపీ ఉన్మాదాలకు పరాకాష్ట అన్నారు.

రాజ్యాంగ విరుద్దంగా ఇక్కడి ఈసీని తొలగించి, తమిళనాడు నుంచి ఇంకో ఈసీని తీసుకొచ్చి అతనితో ప్రమాణం చేయించిన జగన్ డ్రామాలను చూశాం. పంచాయతీల్లో పోటీకి భయపడే జగన్ జిత్తులు. ఓటమి భయంతోనే జగన్నాటకాలు ఆడుతున్నాడని బాబు అగ్రహం వ్యక్తం చేశారు. ప్రలోభాలు, వేధింపులు, బెదిరింపులు, హింసా విధ్వంసాలే జగన్ దినచర్య. భయభ్రాంతులను చేసి గెలుపొందడమే పులివెందుల పంచాయితీ. జగన్ రెడ్డి సీఎం కాగానే రాష్ట్రవ్యాప్తంగా అదే దుష్ట సంస్కృతి. జగన్ సీఎం అయ్యాక అధికార యంత్రాంగం నీరుగారిపోయింది.

రాజ్యాంగ ఉల్లంఘనలకు కూడా తెగించారు. అధికారుల్లో కొందరు వెన్నెముక లేని వ్యక్తులుగా తయారయ్యారు. వైసీపీలాగా టీడీపీ గాలికొచ్చిన పార్టీ కాదు. 4 దశాబ్దాల చరిత్ర , 22ఏళ్లు అధికారంలో ఉన్నపార్టీ టీడీపీ. తెలుగుదేశం అనేది వ్యక్తి కాదు, ఒక రాజకీయ పార్టీ. ప్రజల కోసం పోరాడే పార్టీ తెలుగుదేశం. పోరాటాల్లోనే సిసలైన నాయకత్వం బైటకొస్తుంది. పిరికితనం అనేది తెలియని పార్టీ. భయం అనేది మన ఇంటావంటా లేదు. తప్పుడు కేసులకు, అక్రమ నిర్బంధాలకు భయపడేవాళ్లం కాదు.జగన్ ఉన్మాదానికి అడ్డుకట్ట పడాలంటే అన్ని గ్రామాల్లో టీడీపీ అభ్యర్థులే గెలవాలి’అన్నారు నారా చంద్రబాబు నాయుడు.