ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం జగన్‌ భేటీ

న్యూ ఢిల్లీ : ఏపీ సీఎం జగన్‌ రెండోరోజు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా కేంద్ర ఉక్కు, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయ్యారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ, కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌, పెట్రో వర్సిటీ ఏర్పాటు తదితర అంశాలపై కేంద్రమంత్రితో జగన్‌ చర్చించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో తాము సూచించిన ప్రత్యామ్నాయాలను సీఎం మరోసారి కేంద్రమంత్రికి వివరించారు. కాకినాడ ఎస్‌ఈజడ్‌లో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చర్యలను వేగవంతం చేయాలని కోరారు. వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ విషయంలో రాష్ట్రంపై పెద్దగా భారం లేకుండా చూడాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఏపీలో కచ్చితంగా పెట్రో కాంప్లెక్స్‌ ఏర్పాటు చేస్తామని తెలిపిన ధర్మేంద్ర ప్రదాన్‌.. వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ విషయంలోనూ సానుకూలత వ్యక్తం చేశారు.

ads

వచ్చేవారం ఏపీ సీఎస్‌, పెట్రోలియం శాఖలోని కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. దాదాపు గంటకు పైగా ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం సమావేశం కొనసాగింది. తొలిరోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులు అమిత్‌షా, గజేంద్రసింగ్‌ షెకావత్‌, ప్రకాశ్‌ జావడేకర్‌ తదితరులతో జగన్‌ భేటీ అయిన విషయం తెలిసిందే. మూడు రాజధానులతో పాటు పోలవరం నిధులు, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సీఎం చర్చించారు. రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తోనూ జగన్‌ సమావేశమయ్యే అవకాశముంది.