షర్మిలతో సీఎం జగన్​ సన్నిహితుడి భేటీ

హైదరాబాద్​ : తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే దిశగా వైఎస్ షర్మిల వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ తరుణంలో గురువారం మధ్యాహ్నం వైసీపీ ఎమ్మెల్యే, సీఎం జగన్ సన్నిహితుల్లో ఒకరైన ఆళ్ల రామకృష్ణారెడ్డి లోటస్​పాండ్​లో షర్మిలతో భేటీ అయ్యారు. షర్మిలతో గంటలకు పైగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. వైఎస్ జగన్‌కు సన్నిహితుల్లో ఒకరైన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఆయన కుటుంబంతోనూ సాన్నిహిత్యం ఉంది. షర్మిలతోనూ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఆర్​కే పోటీ చేసిన మంగళగిరి నియోజక వర్గంలో ఆయన తరపున షర్మిల ప్రచారం కూడా నిర్వహించారు. ఆర్​కేపై పోటీ చేసిన చంద్రబాబు తనయుడు, టీడీపీ యువనేత నారా లోకేశ్‌పై తనదైన శైలిలో విమర్శలు కూడా గుప్పించారు. అయితే ఈభేటీలో ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలతో ఏం మాట్లాడారనే అంశం ఆసక్తికరంగా మారింది.