భారీ వర్షాలపై సీఎం సమీక్ష

హైదరాబాద్ : ఎగువ రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన చర్యలు, చేపట్టాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరుగుతున్నది. సీఎస్ సోమేశ్ కుమార్ తో పాటు ఇతర విభాగాల ఉన్నతాధికారులు భేటీకి హాజరయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ టీంలను ఆర్మూర్, నిర్మల్, భైంసా ప్రాంతాలకు తక్షణమే పంపించాలన్నారు.

ads

లోతట్టు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలకు రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. నిరాశ్రయులకు వసతి, బట్టలు, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. కృష్ణా నదీ ప్రవాహం కూడా పెరిగే పరిస్థితి ఉన్నందున నాగార్జున సాగర్ కు ఉన్నతాధికారులను పంపించాలని ఆదేశించారు. మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ టీంలను రప్పించాలని తెలిపారు. హెలిక్యాప్టర్ లను మరిన్ని తెప్పించాలని, గతంలో వరదల పరిస్థితులను ఎదుర్కున్న అధికారులను వినియోగించుకోవాలని పేర్కొన్నారు.

నీటి పారుదల శాఖ, పోలీస్, విద్యుత్ శాఖల అధికారులు అప్రమత్తంగా వుండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను షిఫ్ట్ చేసి రక్షణ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. రిజర్వాయర్ లు ప్రాజెక్ట్ ల నుండి నీటిని నెమ్మదిగా వదలాలని సూచించారు. ఏడు ఎనిమిది మందితో కూడిన ఫ్లడ్ మేనేజ్ మెంట్ టీమ్ ను పర్మినెంట్ గా ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా ప్రతీ సంవత్సరం వరదల రికార్డ్ ను పాటించాలి. పాత రికార్డ్ ను అనుసరించి ఆయా వరద సమయాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

మూసీ నది వరద గురించి ఆరా తీసిన సీఎం. వరద ఉధృతి పెరిగే పరిస్థితి ఉంటే, మూసి లోతట్టులో నివాసం వుంటున్న ప్రజల రక్షణ కోసం ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీఎం అధికారులకు వివరించారు. హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇండ్ల నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని, హెచ్ ఎం డిఎ, జీ హెచ్ ఏం సీ అధికారులకు సీఎం స్పష్టం చేశారు. డ్రైనేజీ పరిస్థితుల మీద ఆరా తీసిన సీఎం, తక్షణమే అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. మారిన పరిస్థితుల్లో.. తెలంగాణ లో ఇక నుంచి కరువు పరిస్థితులు వుండవని, వరద పరిస్థితులను ఎదుర్కునే పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, ఉన్నతాధి కారులకు సీఎం సూచించారు.

గోదావరి నదీ పరివాహక ప్రాంతాలలో వర్షపాతం నమోదు తీరును, ఎస్సారెస్పీపై నుంచి మొదలుకుని కడెం, ఎల్లంపల్లి, స్వర్ణ, కాళేశ్వరం బ్యారేజ్ ల పరిధిలో వరద పరిస్థితిని, కృష్ణ ఎగువన పరిస్థితిని అధికారులు సీఎం కేసేఆర్ కు వివరించారు. గోదావరికి వరద పెరుగుతున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎస్ సహా నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల మంత్రులు, కలెక్టర్లకు పలు ఆదేశాలు జారీ చేశారు.