రిజర్వేషన్లపై కేసీఆర్ కీలక నిర్ణయం

హైదరాబాద్: ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించే ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం సోమవారం జారీ చేసింది. ఈ రిజర్వేషన్లను రాష్ట్రంలోనూ అమలు చేయనున్నట్లు ఈ మధ్యే సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యధాతథంగా కొనసాగిస్తూనే, రాష్ట్రంలోని ఈడబ్ల్యూఎస్‎లకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.

రాష్ట్రంలో ఇప్పటికే బలహీనవర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఈడబ్ల్యూఎస్‎తో కలుపుకొని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్‎లకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించింది. 19 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ చట్టాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపుగా ఇదే విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలుచేసే అవకాశం ఉన్నది.