సంస్థ సేవలు ప్రశంసనీయం

హైదరాబాద్: దివ్యాంగులకు జైపూర్ లోని భగవాన్ మహవీర్ వికలాంగ్ సహాయతా సమితి చేస్తున్న సేవలు ప్రశంసనీయమని మంత్రి కొప్పుల ఈశ్వర్​ అన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పర్యటిస్తున్న మంత్రి గురువారం రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ లోని భగవాన్ మహవీర్ వికలాంగ్ సహాయతా సమితిని సందర్శించారు. ప్రసిద్ధి చెందిన “జైపూర్ ఫుట్” ను ఈ స్వచ్ఛంద సంస్థ తయారు చేసి అవసరమైన దివ్యాంగులకు ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసిందే. భగవాన్ మహావీర్ బోధనల నుంచి స్ఫూర్తినొంది 1975లో స్థాపించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వాహకులు ఈ సంస్థను నడిపిస్తున్నారు.

ఈ సందర్భంగా మంత్రి, అధికారుల బృందం కృత్రిమ అవయవాల తయారీ, పనితీరును పరిశీలించారు. నిర్వాహకులతో సమావేశమై మంత్రి సంస్థ ఏర్పాటు, ఆశయాలు, చేపట్టిన, కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని మరింత పెంచేందుకు, భద్రతకు, సంక్షేమానికి,సముద్ధరణకు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్​ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.

దేశంలో మరెక్కడా కూడా లేనివిధంగా ప్రతినెల రూ. 3,016 రూపాయల పింఛన్ రూ. 90వేల విలువైన త్రిచక్ర వాహనాలు, వీల్ చైర్స్, ల్యాప్ టాప్స్, హియరింగ్ ఎయిడ్స్, 4జీ స్మార్ట్ ఫోన్లు ఉచితంగా అందిస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్​ చెప్పారు. సంస్థ ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాలను తయారీ చేసే మోబైల్ వాహనాన్ని తమ రాష్ట్రానికి కూడా అందజేయాలని ఈ సందర్భంగా మంత్రి కొప్పుల సంస్థ నిర్వాహకులను కోరారు. దీనికి వారు సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ కింగ్ కోఠిలోని తమ సంస్థకు చెందిన యూనిట్ అభివృద్ధికి చేయూతనివ్వాలన్న వారి విజ్ఞప్తిని తెలంగాణ ప్రభుత్వం తప్పక పరిశీలిస్తుందని మంత్రి కొప్పుల వారికి హామీనిచ్చారు. అంతకు ముందు సంస్థ నిర్వాహకులు మంత్రి కొప్పుల బృందానికి సాదర స్వాగతం పలికారు.