రాహుల్‎ను అధ్యక్షుడిని చేయండి!

న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్షుడిగా వెంటనే చేయాలని ఢిల్లీ కాంగ్రెస్ విభాగం ఆదివారం తీర్మానం చేసింది. దేశంలో కలత రేపుతున్న, ప్రమాదకరమైన రాజకీయ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే రాహుల్ గాంధీ లాంటి శక్తివంతమైన నాయకుడు కాంగ్రెస్ పార్టీకి అవసరమని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అనిల్ కుమార్ ఆ తీర్మానంలో పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం దుశ్చర్యలను బహిర్గతం చేయడానికి రాహుల్ దృఢమైన పోరాటం చేస్తున్నారని, ముందుండి కాంగ్రెస్ ను నడిపిస్తున్న ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉండి కార్యకర్తల్లో విశ్వాసం, ధైర్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

పార్టీని బలోపేతం చేయడానికి, దేశాన్ని విధ్వంస మార్గంలో తీసుకెళ్లడానికి ప్రయత్నించే మత, అధికార, అప్రజాస్వామిక శక్తులను ఎదుర్కోవడానికి రాహుల్ అవసరం కాంగ్రెస్ కు ఎంతో ఉన్నదని ఆ తీర్మానం పేర్కొంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వైఫల్యాలకు వారి రాజీనామాలను కోరుతూ మరో రెండు తీర్మానాలను కూడా ఢిల్లీ కాంగ్రెస్ ఆమోదించింది.