తగ్గుముఖం పట్టినా..పెరుగుతున్న మరణాలు

ముంబై : దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో తొలిస్థానంలో కొనసాగుతున్న మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి కొంత తగ్గినప్పటికీ ప్రతీ రోజు మూడువేల వరకు పాజిటివ్ కేసులు, 50 కి పైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటగా, మరణాల సంఖ్య 51వేలు దాటింది. శుక్రవారం నుంచి శనివారం వరకు కొత్తగా 2,630 కరోనా కేసులు, 42 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,23,814 కు, మరణాల సంఖ‌్య 51,045కు చేరింది.

గడిచిన 24 గంటల్లో 1,535 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 19,27,335కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44,199 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.