ఆ దేశంలో కరోనా మృత్యుఘోష

రియో : బ్రెజిల్ లో కరోనా విలయతాండవం చేస్తున్నది. ఇంకా ఆ దేశంలో కరోనా మృత్యుఘోష కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొవిడ్ వల్ల ఆ దేశంలో 4195 మందికి పైగా మరణించారు. అత్యంత ప్రమాదకరమైన వేరియంట్లు బ్రెజిల్ లో భీకర రూపం దాల్చాయి. అన్ని నగరాల్లోని హాస్పిట్స్ అన్నీ రోగులతో కిక్కిరిసిపోయాయి. చికిత్స కోసం కరోనా బాధితులు హాస్పిటళ్లలో పడిగాపులు కాస్తున్నారు.

ads

అనేక ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలు నిర్జీవావస్తకు చేరుకున్నాయి. కరోనా వైరస్ వల్ల బ్రెజిల్ లో మృతిచెందిన వారి సంఖ్య 3,37000 కు చేరుకున్నది. అమెరికా తర్వాత అత్యధిక మరణాలు సంభవించింది బ్రెజిల్ లోనే . అయితే మహమ్మారిని అదుపు చేసేందుకు అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో మాత్రం లాక్ డౌన్ అమలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. వైరస్ నష్టం కన్నా , లాక్ డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని ఆయన వాదిస్తున్నారు.

ఇప్పటివరకు బ్రెజిల్ లో కోటి 30 లక్షల మందికి కరోనా వైరస్ సంక్రమించింది. ఈ యేడాది మార్చిలోనే ఆ దేశంలో వైరస్ వల్ల 66570 మంది మరణించారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కొవిడ్ పేషంట్లు 90 శాతం వరకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బెడ్స్ ను వాడుతున్నారు. అనేక రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఇప్పటివరకు కేవలం 8 శాతం మందికి మాత్రమే తొలి డోసు టీకా అందినట్లు తెలుస్తోంది. కనీసం 20 రోజుల పాటు కఠిన లాక్ డౌన్ అమలు చేస్తేనే వైరస్ వ్యాప్తిని అడ్డుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. బ్రెజిల్ వేరియంట్ కేసులు దేశంలో కొత్తగా 92 నమోదు అయ్యాయని అన్నారు. ఆ కొత్త స్ట్రెయిన్ వల్లే దేశంలో కరోనా ఉదృతంగా వ్యాప్తి చెందుతున్నట్లు అంచనా వేస్తున్నారు.