కరోనా నియంత్రణకై వేముల వినూత్న ప్రయత్నం

వరంగల్ అర్బన్ జిల్లా : కరోనా విపత్కర సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడే దిశగా ప్రజాప్రతినిధులు పనిచేస్తున్నారు. కరోనా నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 7వ డివిజన్ లో ఇలాంటి ప్రయత్నానికే నాంది పలికారు స్థానిక టీఆర్ఎస్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్. 7వ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో కొవిడ్ నియంత్రణకు సంబంధించిన ప్రతీ కార్యక్రమాన్ని రోజూవారీగా నిర్వహిస్తున్నారు. ఇంటింటి జ్వర సర్వేతో పాటు, ప్రజల యోగ క్షేమాలు తెలుసుకుని , కొవిడ్ బారిన పడిన వారికి అండగా నిలుస్తున్నారు కార్పొరేటర్ వేముల శ్రీనివాస్. దీంతో పాటు కరోనా నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే , తన వినూత్న ఆలోచనను తన డివిజన్ లో నేడు ప్రదర్శించారు.

ads

మాటల్లో కంటే చేతల ద్వారా కరోనా నియంత్రణకు సంబంధించిన నియమాలను ప్రజల్లో చొచ్చుకుపోయేలా చేశారు. కొవిడ్ నిబంధనలు, కరోనా రాకుండా తీసుకోవాల్సిన శారీరక శుభ్రత, పరిసరాల పరిశుభ్రత వంటి పలు అంశాలను గోడలపై పెయింటింగ్ వేయించారు. ఈ వాల్ పెయింటింగ్స్ ను సోమవారం కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ ప్రారంభించారు. డివిజన్ లోని పలు కాలనీల్లో గోడలపై పెయింటింగ్స్ తో అవగాహన కల్పిస్తున్నారు కార్పొరేటర్ వేముల శ్రీనివాస్.

కరోనా నియంత్రణకు సంబంధించిన పలు జాగ్రత్తలను మాటలతో చెప్పడం కంటే చిత్రాల ద్వారా చూపించడం వల్ల ప్రజలకు త్వరితగతిన అవగాహన కల్గుతుందని కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ అన్నారు. ఈ పెయింటింగ్స్ చూసినప్పుడల్లా కొవిడ్ జాగ్రత్తలు ప్రజల మనస్సులో మెదులుతాయని, దీంతో డివిజన్ ప్రజలు కరోనా నియంత్రణలో భాగస్వాములై కరోనా వైరస్ ను తరిమికొడతారని ఆయన చెప్పారు.