కొవిడ్ కష్టకాలంలోనూ రైతులకు అండగా సీఎం

ములుగు జిల్లా : ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు తను పండించిన పంటను అమ్మడంలో ఇబ్బంది పడకూడదని, దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఊరూరా ఏర్పాటు చేసి పంటను కొంటున్నారని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు పేర్కొన్నారు. గత సంవత్సరం కొవిడ్ కష్టకాలంలోనూ పంటను కొనుగోలు చేసి, ఈసారి కేంద్రం మార్కెట్లు, కొనుగోలు కేంద్రాలు పెట్టవద్దని చెబుతున్నా, రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. ఈసారి ధాన్యం కొనుగోలు కోసం 20వేల కోట్ల రూపాయలను పౌర సరఫరాల శాఖకు బ్యాంక్ గ్యారంటి ఇచ్చారన్నారు. ములుగు, జయశంకర్ భూపాలజిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇరిగేషన్, కోవిడ్ -19, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఆర్.ఓ.ఎఫ్.ఆర్ లపై మంత్రులిద్దరు సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో నేడు ములుగు జిల్లాలోని కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు.

ads

గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి రవాణా సదుపాయాలలో లోటు లేకుండా , గోనె సంచులు తక్కువ కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రులిద్దరూ అధికారులకు సూచించారు. అదేవిధంగా గోదాముల సామర్థ్యం, పంట దిగుబడికి తగ్గట్లుగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. రైతులు తమ ధాన్యాన్ని తాలు లేకుండా, తేమ శాతం 17 మించకుండా ఉండేలా చూసుకోవాలని విజ్ణప్తి చేశారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, తూకం వేయడంలో, వేసిన తర్వాత అక్కడ ఆగకుండా మిల్లర్లతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. రైతుల ధాన్యాన్ని తాలు, తేమ పేరుతో కోత విధించకుండా మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు.

గత ఏడాది కోవిడ్ వల్ల లాక్ డౌన్ విధించి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నామని, మళ్లీ ఈసారి కూడా కోవిడ్ విజృంభిస్తోందని, ప్రతీ ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అధికారులు కోవిడ్ నేపథ్యంలో అన్ని విధాల సేవలు అందించేందుకు సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ సాగునీటి విషయంలో ఇప్పటికే తెలంగాణను గొప్పగా తీర్చదిద్దారని అన్నారు. ములుగు జిల్లా, జయశంకర్ భూపాలపల్లిలో కూడా ఆఖరి ఆయకట్టు వరకు నీరు అందేలా గతంలో చేసిన ప్రణాళికలు అమలు జరిగేటట్లు చూడాలన్నారు. సీఎం వచ్చే ఆరు నెలల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో మార్కెట్ల పనులు వేగవంతం చేయాలని కోరారు.

సమీక్షకు ముందు ములుగు జిల్లా గట్టమ్మ దేవాలయంలో మంత్రులు పూజలు చేశారు. అనంతరం సంచార చేపల విక్రయ వాహానాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, సీతక్క, జిల్లా కలెక్టర్లు, అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.