కొవిడ్​ జాగ్రత్తలు తప్పనిసరి

రంగారెడ్డి జిల్లా : స్కూళ్ల వద్ద పకడ్బందీగా కొవిడ్​ జాగ్రత్తలు చేపట్టినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం జిల్లెల గూడ జిల్లా పరిషత్ పాఠశాలను మంత్రి తనిఖీ చేశారు. విద్యార్థులు తల్లిదండ్రుల అనుమతి పత్రాలతో పాఠశాలకు వచ్చినట్లు పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో పూర్తి హాజరు శాతం నమోదయ్యే అవకాశం ఉందని మంత్రి సబితా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల, కళాశాలలకు విద్యార్థులు ఉత్సాహంగా వస్తున్నారన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా హ్యాండ్ వాష్ చేసుకోవాలని, మాస్క్ లు పెట్టుకోవాలని, జ్వరం, జలుబు ఉంటే వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. మధ్యాహ్న భోజనం వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పాఠశాలలు, హాస్టల్స్ పై వేరువేరు గా కొవిడ్ జాగ్రత్తల తో ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలకు రావడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా విద్యార్థులు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి వెంట డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి,ఆర్జేడీ,డీఈవో తదితరులు ఉన్నారు.