ప్రైవేట్ మార్కెట్‎లో కొవిడ్ వ్యాక్సిన్ 

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతుండటంతో మార్చి చివర్లో లేదా ఏప్రిల్ నాటికి వ్యాక్సినేషన్ ను ప్రైవేట్ మార్కెట్ లో అనుమంతించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టేందుకు అనుకున్న దానికంటే ముందుగానే వ్యాక్సిన్లను ప్రైవేట్ మార్కెట్ లో అందుబాటులో ఉంచేందుకు కసరత్తు సాగుతోందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( డీసీజీఐ ) ఆమోదం ప్రకారం కొవిడ్-19 వ్యాక్సిన్లు ఆరునెలల వరకు నిల్వ చేసేందుకు అనువుగా ఉంటాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ పై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు, అపోహలను తొలగించేందుకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ అనుకున్నంత ముమ్మరంగా సాగకపోవడంతో వీలైనంత త్వరగా ప్రైవేట్ మార్కెట్ లోకి అనుమతించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా, భారత్ లో ఇప్పటివరకు ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనెకాల భాగస్వామ్యంతో సీరం ఇనిస్టిట్యూల్ లో తయారైన కొవిషీల్డ్ , హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవ్యాగ్జిన్ వ్యాక్సిన్ల వాడకానికి డీసీజీఐ అనుమతించింది.