విదేశాలకు వ్యాక్సిన్లు ఎగుమతి లేదు

న్యూఢిల్లీ : కరోనా వైరస్ వ్యాక్సిన్లను విదేశాలకు ఎగుమతి చేయబోమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్ సరఫరాలు, ఎగుమతులపై అత్యున్నత ప్రభుత్వ కమిటీ, నిపుణుల కమిటీల పర్యవేక్షణలో సమతూకం పాటించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3.29 కోట్ల మందికి కరోనా వైరస్ వ్యాక్సిన్ డోసులు వేశామని మంగళవారం రాజ్యసభలో మాట్లాడుతూ మంత్రి తెలిపారు. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 24,492 తాజా కొవిడ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ads

మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. దేశవ్యాప్తంగా నమోదవుతున్న తాజా కేసుల్లో 80 శాతం ఈ రాష్ట్రాల్లోనే వెలుగుచూస్తున్నాయి. ఇక భారత్ బయోటెక్ కొవాగ్జిన్, ఆక్స్ ఫర్డ్- ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‎లకు భారత్ ఆమోదం తెలిపిన తర్వాత లక్షలాది వ్యాక్షిన్ల డోసులను గ్రాంట్ సాయం కింద పలు దేశాలకు పంపగా, మరికొన్ని దేశాలు భారత్ నిర్ణయించిన ధరకు వ్యాక్సిన్లను దిగుమతి చేసుకున్నాయి.