సీపీజీఈటీ- 2020 సీట్ల కేటాయింపు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలోని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న సీపీజీఈటీ- 2020 మొదటి విడుత సీట్ల కేటాయింపు పూర్తయిందని సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్.కిషన్ తెలిపారు. కన్వీనర్ కోటా కింద ఓయూ, కేయూ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీలలో కలిపి 38,059 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మొత్తం 40,182 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకోగా, మొదటి దఫాలో 25,649 మందికి సీట్లు వచ్చాయని పేర్కొన్నారు. సంబంధిత కోర్సు ఫీజును ఆన్ లైన్ విధానంలో చెల్లించి, ఈ నెల 17వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని సూచించారు.

మొదటి దఫాలో పొందిన సీటును రిజర్వ్ చేసుకోదలిచిన వారు తమకు కేటాయించిన కళాశాలలో ధ్రువపత్రాలతో స్వయంగా రిపోర్ట్ చేయాలన్నారు. కేటాయించిన కాలేజీలలో కేవలం టీసీ మాత్రమే అందచేయాలని, ఇతర ఏ విధమైన సర్టిఫికెట్లు ఇవ్వకూడదని సూచించారు.