ఐపీఎల్ 2021లో కోల్ కతాపై చెన్నై గెలుపు

ముంబై : ఐపీఎల్ 14వ సీజన్ లో సమిష్టి ఆటతీరుతో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి అద్భుత విజయాన్ని అందుకుంది. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఆసక్తికర పోరులో చెన్నై 18 పరుగుల తేడాతో గెలుపొందింది. 221 పరుగల లక్ష్య ఛేదనలో కోల్ కతా 19.1 ఓవర్లలో 202 పరుగులకే కుప్పకూలింది. పాట్ కమిన్స్ ( 66 నాటౌట్ : 34 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు ), ఆండ్రీ రస్సెల్ ( 54: 22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు ) , దినేష్ కార్తీక్ ( 40: 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు ) పోరాటం వృథా అయింది. భారీ ఛేదనలో రస్సెల్, కార్తీక్, కమిన్స్ మాత్రమే దంచికొట్టారు. ఆశలు వదులుకున్న స్థితిలో ఈ ముగ్గురు బౌండరీలతో కదం తొక్కుతూ జట్టును లక్ష్యం వైపు నడిపించాడు. ఆఖర్లో కమిన్స్ ఆదుకొనే ప్రయత్నం చేసినా మరో ఎండ్ లో సహకరించేవారు లేకపోవడంతో కోల్ కతా లక్ష్యాన్ని అందుకోలేకపోయింది.

ads

తొలి ఐదుగురు బ్యాట్స్ మన్ సింగిల్ డిజిట్ కు పెవిలియన్ కు క్యూ కట్టారు. నితీష్ రాణా (9), శుభ్ మన్ గిల్ (0), రాహుల్ త్రిపాఠి (8), ఇయాన్ మోర్గాన్ (7), సునీల్ నరైన్ (4), అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ ఆదిలోనే కోల్ కతా భారీ దెబ్బకొట్టాడు. నాలుగు వికెట్లు తీసి కష్టాల్లో పడేశాడు. లుంగి ఎంగిడి 3 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు డుప్లెసిస్ ( 95 నాటౌట్ : 60 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (64: 42 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో 20 ఓవర్లలో చెన్నై 3 వికెట్లకు 220 పరుగులు చేసింది.

చెన్నై ఇన్నింగ్స్ లో గైక్వాడ్, డుప్లెసిస్ ఆటే హైలెట్, కోల్ కతా బౌలర్లను ఆటాడుకున్న ఈ జోడీ ఫోర్లు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగెత్తించడారు. ఇద్దరూ ఆద్యంతం కళ్లు చెదిరే బ్యాటింగ్ తో బౌలర్లపై విరుచుకుపడటంతో అనూహ్య స్కోరు సాధించింది. 35 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న డుప్లెసిస్ చివరిలో విధ్వంసం సృష్టించాడు.