అకౌంట్ నుంచి రూ.40 వేలు మాయం

గుంటూరు జిల్లా : సైబర్ నేరగాళ్లు విసురుతున్న మాయాజాలానికి అమాయకులు బలైపోతున్నారు. చిలకలూరిపేటలోని ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలో నుంచి ఓ సైబర్ నేరగాడు రూ.40 వేలు కాజేశాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చిలకలూరిపేట పట్ట ణంలోని సంజీవనగర్‌కు చెందిన కారుమంచి శ్రీనివాసరావు కుమార్తె ఏఎన్‌యూలో పీజీ చదువుతోంది. వీరికి జగనన్న విద్యాదీవెన పథకం లబ్ధి అందలేదు. గురువారం సాయంత్రం శ్రీనివాసరావు సెల్ ఫోన్ కు ఓ వ్యక్తి అమ రావతి సచివాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని కాల్​ చేశాడు. మీకు విద్యాదీవెన పథకం లబ్ధి అందిందా.. అంటూ వాకబు చేశాడు. దీంతో శ్రీనివాసరావు తమకు అందలేదని చెప్పాడు. శ్రీనివాసరావును ఫోన్ లైన్ లోనే ఉంచి వారి ఏరియాకు చెందిన వార్డు వలంటీర్‌కు ఆ వ్యక్తి ఫోన్ కలిపాడు.

ads

శ్రీనివాసరావు కుమార్తెకు విద్యాదీవెన లబ్ధి ఎందుకు అందలేదని వలంటీర్ ను ప్రశ్నించాడు. సంబంధిత అన్ని ధృవపత్రాలు అందించామని ఇంకా నగదు జమ కాలేదని వలంటీర్ చెప్పింది. అయితే ఆ వ్యక్తి శ్రీనివాసరావుతో మీకు విద్యాదీవెన మంజూరైందని తెలిపాడు. నగదు ఖాతాలో జమ అవుతుందని చెప్పాడు. మీ బ్యాంకు వివరాలు తెలపాలని కోరాడు. ఆ వివరాలు తెలుసుకుని సెల్ ఫోన్ కు వచ్చిన ఓటీపీ చెప్పమని అడిగాడు. ప్రభుత్వ అధికారి అడిగాడు కదా అని భావించిన శ్రీనివాసరావు రెండు సార్లు తన సెల్‌ఫోన్‌కు వచ్చిన ఓటీపీ ఆ వ్యక్తికి చెప్పాడు. మీకు నగదు జమ అవుతుందని ఆ వ్యక్తి చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత రూ.20 వేల చొప్పున రెండు సార్లు మొత్తం రూ .40 వేలు శ్రీనివాసరావు ఖాతాలో డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. ఒక్కసారిగా కంగుతిన్న శ్రీనివాసరావు మోసపోయామని గుర్తించి గురువారం రాత్రి చిలకలూరిపేట అర్బన్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.